TG News: ఖరీఫ్‌ సాగు ఆలస్యమే!

వానాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Published : 06 Jul 2024 04:42 IST

రిజర్వాయర్లలోకి ప్రారంభం కాని ప్రవాహాలు
మహారాష్ట్ర, కర్ణాటకలలోనూ భారీ వర్షాలు లేకపోవడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం ప్రారంభమై నెలరోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోతగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్‌ ఆయకట్టు సాగు జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే కొన్ని జిల్లాల్లోనే తక్కువగా నమోదైంది. అయితే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16వేల క్యూసెక్కులు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు.ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ నీటి ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలంలోకి ఇప్పటివరకు కేవలం ఆరున్నర టీఎంసీలు రాగా, నాగార్జునసాగర్‌లోకి దాదాపుగా ఏమీ లేనట్లే. ఎగువన ఉన్న జూరాలలోకి ఏడు టీఎంసీలు రాగా, తుంగభద్రలోకి కూడా కేవలం ఎనిమిది టీఎంసీలు వచ్చాయి. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరిగితే కానీ ఆయకట్టుకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలన్నదానిపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం కూడా జరగలేదు.

ఎగువనా అంతంతే...

కృష్ణాబేసిన్‌లో ఎగువన కర్ణాటకలో ఉన్న ఆలమట్టిలోకి కూడా ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 25 టీఎంసీలు మాత్రమే ఆలమట్టిలోకి రాగా, శుక్రవారం కొంత ప్రవాహం పెరిగి 53వేల క్యూసెక్కులు వస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లలోకి 90 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలంలోకి నీటి విడుదల ప్రారంభం కాదు. గత ఏడాది వర్షాభావంతో ఆయకట్టు సాగుపై ప్రభావం పడటంతో పాటు రిజర్వాయర్లలో కనీస నీటిమట్టానికి దిగువన మట్టాలున్నాయి.

గోదావరి బేసిన్‌లో...

గోదావరి బేసిన్‌లో కూడా ఇప్పటివరకు పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామసాగర్‌లోకి కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే వచ్చాయి. సింగూరు, నిజాంసాగర్‌లలోకి ఏమీ రానట్లే. కడెం, ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ మానేరు ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి కూడా ప్రవాహాలు లేవు. రెండు బేసిన్లలోని 36 మధ్యతరహా ప్రాజెక్టుల కింద నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పెద్దవాగు, జగన్నాథపూర్, తాలిపేరు మినహా మిగిలిన మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు లేకపోవడంతో వీటి కింద కూడా సాగు జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని