Kishan Reddy: ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం

దేశంలోని ఖనిజాల తవ్వకాలను పెంచడం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలకు, ఎగుమతులు పెంచడం ద్వారా ప్రగతికి బాటలు వేస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 14 Jun 2024 05:47 IST

బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి 

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిషన్‌రెడ్డి. పక్కన ఆ శాఖ సహాయమంత్రి సతీశ్‌చంద్ర దూబే

ఈనాడు, దిల్లీ: దేశంలోని ఖనిజాల తవ్వకాలను పెంచడం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలకు, ఎగుమతులు పెంచడం ద్వారా ప్రగతికి బాటలు వేస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఉదయం ఇక్కడి శాస్త్రి భవన్‌లోని బొగ్గు, గనుల కార్యాలయంలో క్యాబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన తన కార్యాలయంలో పూజలు చేశారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బొగ్గు, గనులశాఖ సహాయమంత్రి సతీశ్‌చంద్ర దూబే, కిషన్‌రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బొగ్గుతో విద్యుత్తు, రైల్వే, గనులు, పర్యావరణశాఖలు ముడిపడి ఉన్నాయని, వాటన్నింటితో సమన్వయం చేసుకుంటూ ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేస్తానని తెలిపారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం మూడో స్థానానికి చేరాలంటే విద్యుత్తు రంగం చాలా ముఖ్యం. పదేళ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్తు కొరత ఉండేది. ఆ సమయంలో పరిశ్రమలకు కేటాయించిన దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే జరిమానా విధించేవారు. విద్యుత్తు కోసం పారిశ్రామికవేత్తలు రోడ్లమీదికి వచ్చిన సందర్భాలున్నాయి. విద్యుత్తు కొరత కారణంగా పంటలు ఎండిపోయి పెద్దసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్తు కోతలు లేని నూతన భారతాన్ని ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలకూ అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉంటోంది. అందుకు ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తిని పెంచడమే. రానున్న రోజుల్లో విద్యుదుత్పత్తిని మరింత పెంచడం కోసం మోదీ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం.. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేంతగా బొగ్గును ఉత్పత్తి చేస్తాం’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని