Konda surekha: భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు

భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు.

Updated : 16 Jun 2024 06:40 IST

దానిపై నివేదిక ఇవ్వండి
అధికారులకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశం
కేంద్ర ప్రభుత్వ సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తాలి: సీతక్క

సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కొండా సురేఖ, పక్కన మరో మంత్రి సీతక్క

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. పోడు భూముల సమస్యల పరిష్కారంపై ఆమె ఆధ్వర్యంలో సచివాలయంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా అటవీ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పనిచేయాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు. ‘‘పోడు రైతు కుటుంబాల వారు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దు.. తలపెట్టి క్రమశిక్షణా చర్యలకు గురికావద్దు. వ్యవసాయం పేరుతో చట్టాలకు విరుద్ధంగా కొత్తగా అటవీ భూముల్ని ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కాల్పోల్‌ గ్రామంలో అటవీ అధికారులపై గిరిజనులు శుక్రవారం చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. అటవీ ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని అటవీ శాఖ మంత్రిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలుకు అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. కేంద్ర ప్రభుత్వ సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి, కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలి’ అని సూచించారు. పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యాన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ‘అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను పెంచడం ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగిస్తూనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించవచ్చు’ అని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ఈ దిశగా ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

వలసలతో ఇక్కడివారికి నష్టం

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. ‘‘పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా... ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి’’ అని అధికారులను మంత్రులు సురేఖ, సీతక్క ఆదేశించారు. అనంతరం వర్షాకాలంలో పచ్చదనం పెంపుదలపై చర్చ జరిగింది. ‘వేప, బొడ్డు మల్లె, కుంకుడు, సీతాఫలం సహా అన్నిరకాల మొక్కలను నాటాలి. అటవీశాఖ నర్సరీల్లో చాలా మొక్కలున్నాయి. బయట నుంచి మొక్కలు కొనుగోలు చేయొద్దు’ అని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.


అయిదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణం 

త్వరలోనే మహిళలకు నెలనెలా రూ. 2500 సాయం: మంత్రి సీతక్క
ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళిక విడుదల

ఈనాడు,హైదరాబాద్‌: మహిళాశక్తి పథకం కింద వివిధ కార్యక్రమాల కోసం తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చే అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  స్వయంసహాయక సంఘాల బ్యాంకు లింకేజీ 2024-25 వార్షిక రుణప్రణాళికను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు అందుతాయని, 2,25,000 మంది మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ.4,500 కోట్లు బ్యాంకుల నుంచి అదనంగా సాయం అందిస్తామని వెల్లడించారు. మహిళల సాధికారతే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, గ్యాస్‌ సబ్సిడీని అందిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 సాయం పథకాలను ప్రారంభిస్తామన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళాసంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వడ్డీలేని రుుణాల కింద డిసెంబరు 2023 నుంచి 2024 మార్చి వరకు 2,53,864 సంఘాలకు రూ.264.34 కోట్లు విడుదల చేశాం. అందులోని మహిళలకు రూ.10 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల రుణ బీమా సదుపాయం కల్పించాం. ఏకరూప దుస్తుల కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించగా వారికి రూ.50 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రామీణ మహిళలకు పాడి, కోళ్ల పరిశ్రమలతో పాటు ఇతర వృత్తుల్లో శిక్షణనిచ్చి బ్యాంకుల నుంచి రుణసాయం అందిస్తాం’’ అని సీతక్క పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా, కమిషనర్‌ అనితా రామచంద్రన్, నాబార్డు సీజీఎం చింతల సుశీల, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని