KTPP: కేటీపీపీ సరికొత్త రికార్డు!

కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (కేటీపీపీ) 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది.

Published : 09 Jul 2024 04:36 IST

రెండో యూనిట్‌లో 202 రోజులు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి..

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, గణపురం(చెల్పూరు), న్యూస్‌టుడే: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (కేటీపీపీ) 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో మొదటి యూనిట్ 500, రెండో యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్తు కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబరు 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36 శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించింది. ప్రభుత్వరంగ విద్యుత్తు కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజులు ఏకబిగిన నడిచిన యూనిట్‌గా నిలిచింది. 202 రోజుల్లో ఈ యూనిట్‌లో 2,460.2 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల యూనిట్‌ 194 రోజులు నిరంతరాయంగా నడిచింది. ఆ రికార్డును కేటీపీపీ తిరగరాసింది. 

  • కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో 2009లో ప్రారంభమైన మొదటి యూనిట్‌లో రోజుకు 12 మిలియన్‌ యూనిట్ల చొప్పున, 2016లో ప్రారంభమైన రెండో యూనిట్లో రోజుకు 14.4 మి.యూ. చొప్పున ఉత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తికి రోజుకు దాదాపు 16 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా.. జెన్‌కోకు కేటాయించిన తాడిచర్ల ఓసీపీ నుంచి 8 వేల టన్నులు, భూపాలపల్లి, ఇతర ప్రాంతాల నుంచి సింగరేణి ద్వారా 8 వేల టన్నులు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి సుమారు 53 కి.మీ. మేర 2 పైపులైన్ల ద్వారా రోజుకు  8 లక్షల లీటర్ల గోదావరి జలాలను తరలిస్తున్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని