KTR: దమ్ముంటే నాపై కేసు పెట్టించండి

‘‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణాను ఆధునికీకరించేందుకు రోడ్లు, పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు పెద్దఎత్తున నిర్మిస్తోంది. అందులో భాగంగా ఐడీఎల్‌ భూముల నుంచి రోడ్డు నిర్మిస్తున్నాం.

Updated : 22 Jun 2022 07:28 IST

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్‌ సవాల్‌

ప్రధానితో మాట్లాడి కంటోన్మెంట్‌ భూములు అప్పగించాలని డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌, మూసాపేట, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణాను ఆధునికీకరించేందుకు రోడ్లు, పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు పెద్దఎత్తున నిర్మిస్తోంది. అందులో భాగంగా ఐడీఎల్‌ భూముల నుంచి రోడ్డు నిర్మిస్తున్నాం. నగరంలో ఉండే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధికారులపై కేసు పెట్టండంటూ ఐడీఎల్‌ అధికారులకు సూచించారు. పొట్టకూటి కోసం పనిచేసే సిబ్బంది, ఇంజినీర్లపై కేసు నమోదు చేయడం సిగ్గు చేటు.  దమ్ముంటే మున్సిపల్‌ మంత్రి అయిన నాపై కేసు పెట్టించండి’’ అని కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సవాలు విసిరారు. ‘మీకు ప్రధాని వద్ద పలుకుబడి ఉంటే సికింద్రాబాద్‌, మెహిదీపట్నంలలోని కంటోన్మెంట్‌ భూములను రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాల’ని డిమాండ్‌ చేశారు. కొంపల్లి, సుచిత్రా, కరీంనగర్‌ రోడ్‌ తదితర చోట్ల రక్షణశాఖ అనుమతిచ్చినా ఇవ్వకపోయినా పైవంతెనలు, ఆకాశమార్గాలు నిర్మించి చూపిస్తామని చెప్పారు. మంగళవారం మూసాపేట నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్లే వాహనాల కోసం కైత్లాపూర్‌లో నిర్మించిన ఆర్‌వోబీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపా తీరును తీవ్రంగా విమర్శించారు. ‘‘హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సందర్భంగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు వస్తారు. అబద్ధాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆ సమయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జనాన్ని కేంద్రం రోడ్డున పడేసింది. వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధాని సహా ఆ పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు’’ అని మంత్రి ప్రశ్నించారు.  ‘‘మోదీ అబద్ధాల గురించి అందరికీ తెలుసు. 2014లో ప్రజలంతా జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి. రూ.15 లక్షలు ఖాతాలో వేస్తామన్నారు. అది నమ్మి ఓట్లేసిన జనం పూర్తిగా మోసపోయారు’’ అని వివరించారు. అగ్నిపథ్‌ పథకంతో యువత పొట్ట కొడుతున్నారని విమర్శించారు. బల్దియా ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద రూ.8,052 కోట్లతో మొదటి దశలో 47 పనులు చేపట్టామన్నారు. ‘‘కైత్లాపూర్‌లోనిది 30వ పని.. మిగిలిన 17 పనుల్లో 6 ప్రాజెక్టులు ఈ ఏడాది, మిగిలినవి రాబోయే సంవత్సరం పూర్తవుతాయి. రూ.3,115 కోట్లతో రెండోదశ ఉంటుంది. ఐడీఎల్‌ చెరువును సుందరీకరిస్తాం. బాలానగర్‌ సొసైటీలో ఖాళీగా ఉన్న భూమిని తీసుకుని 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తాం’’ అని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కె.నవీన్‌రావు, శంభీపూర్‌ రాజు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని