Updated : 18 Mar 2022 04:58 IST

KTR: దమ్ముంటే గంగుల మీద గెలువు

బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్‌
మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి సహా పలు పనులకు శంకుస్థాపనలు
తెరాసలోకి ఇద్దరు భాజపా కార్పొరేటర్లు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ‘అభివృద్ధి అంటే ఆషామాషీ కాదు.. ఉద్యమ కాలం నాటి నీళ్లు, నిధులు, నియామకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న ఘనమైన ప్రభుత్వం మాది’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లో రూ.410 కోట్లతో మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి, కరీంనగర్‌ స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.610 కోట్లు, చొప్పదండి పురపాలికలో రూ.55 కోట్లతో చేపడుతున్న పనులకు ఆయన గురువారం శంకుస్థాపనలు చేశారు. అనంతరం కరీంనగర్‌, చొప్పదండి బహిరంగ సభల్లో మాట్లాడారు. దమ్ముంటే బండి సంజయ్‌ కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై పోటీచేసి నెగ్గాలని సవాల్‌ విసిరారు. ఎంపీగా కరీంనగర్‌ ప్రజలకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశాన్ని గోల్‌మాల్‌ చేసే వ్యక్తి ప్రధాని అయ్యారని మోదీనీ విమర్శించారు. ‘తెలంగాణ వస్తే ఏమైతది అనేందుకు ఇన్నాళ్లుగా మేము చేసిన, చేస్తున్న అభివృద్ధే సమాధానం. మే లేదా జూన్‌ నుంచి 57 ఏళ్లు పైబడిన వారందరికీ¨ పింఛన్లు ఇస్తాం. కేసీఆర్‌ను తొక్కేస్తం? జైలుకు పంపుతాం? సాగనంపుతాం? అంతుచూస్తాం? అని కొంతమంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ముఖ్యమంత్రి చేసిన తప్పేంటి? ఆరు గంటల పాటు కరెంట్‌ ఇయ్యని కాంగ్రెస్‌ను తప్పించి నిరంతరాయంగా విద్యుత్తును రైతులకు అందిస్తున్నందుకు సీఎంని ఇంటికి పంపిస్తారా? 63 లక్షల రైతు కుటుంబాలకు రూ.53 వేల కోట్ల రైతుబంధు ఇచ్చినందుకా? కాళేశ్వరాన్ని కట్టించినందుకు తొక్కేస్తారా? ఏ కారణంతో సీఎంని దించేయాలో ఎదుటి పార్టీ వాళ్లు చెప్పాలి. ప్రజలు మాత్రం కేసీఆర్‌ పాలనలో మంచి జరుగుతుందనే సంతోషంతో ఉన్నారు.

మూడేళ్లల్లో ఆయనేమి చేశారు?
తెరాస చేసిన వెయ్యి పనులను నేను చెప్తా. మూడేళ్లలో కనీసం కరీంనగర్‌ నగరం కోసం రూ.3 కోట్ల పని చేశారా? అనే విషయం ఎంపీ బండి సంజయ్‌ ప్రజలకు చెప్పాలి. గంగుల కమలాకర్‌ చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయి.. తర్వాత మేము తేలికగా తీసుకున్న ఎంపీ ఎన్నికల్లో ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన’ చందాన బండి సంజయ్‌ గెలిచారు. ఆయన ఇప్పుడు కేసీఆర్‌ను జైలుకు పంపుతా అంటరు. ఆయనే ఇటీవల జైలుకు పోయారు. ఇక్కడి ప్రజలకు సాగు, తాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని పార్లమెంట్‌లో అడిగారా? ఇక్కడి యువత కోసం కనీసం ఓ కళాశాల తెచ్చారా? ఏదీ లేదు. తెల్లారి లేస్తే ఒక్కటే లొల్లి. హిందూ- ముస్లిం లేదా భారత్‌- పాకిస్థాన్‌ అని విషం చిమ్మే పనికి మాలిన మాటలు తప్ప.. ప్రజలు, యువతకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా? డబుల్‌ ఇంజిన్‌ కోరుకుంటున్నరంటున్నవ్‌ కదా.. మీద దిల్లీలో మోదీ ఉండె. అక్కడ పతార(పరపతి) ఉంది కదా? ఏం చేశారు కరీంనగర్‌కు.. నా అంతటి హిందువు లేడని అనుకునే సంజయ్‌ కనీసం రాజన్న ఆలయాన్ని అయినా బాగు చేయిస్తున్నరా? నేను ఆయనకు సవాలు విసురుతున్న. దమ్ముంటే కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలె. ఇక మోదీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంది. ఏమయ్యాయి? నేతన్నల కోసం 8 ఏళ్లుగా మెగా పవర్‌లూమ్‌ కావాలని అడుగుతున్నా.. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు అవి చేస్తం, ఇవి చేస్తమని గెలిచి తెలంగాణకు ఏమైనా తెచ్చారా? ఇక్కడున్న కేంద్ర మంత్రి నిస్సహాయంగా ఉన్నరు. హైదరాబాద్‌లో వరదలొచ్చినప్పుడు బాధితులకు రూ.10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.660 కోట్లు ఇచ్చింది. కేంద్రమంత్రి కూడా వచ్చి ఫొటోలు దిగారు. అల్లంబెల్లమని చెప్పి 18 నెలల నుంచి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క పైసా తేలేదు. గుజరాత్‌లో వరదలొస్తే మోదీ వెళ్లి రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. సభలో మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. గాడ్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ కేటీఆర్‌ అని అన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, సాయిచంద్‌, ఎల్‌.రమణ, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు భాజపా నుంచి కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు.


రేపటి నుంచి మంత్రి కేటీఆర్‌ పది రోజుల అమెరికా పర్యటన
భారీ పెట్టుబడుల సాధనకు 29 వరకు భేటీలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ పెట్టుబడుల సాధన కోసం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పది రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 19న ఆయన హైదరాబాద్‌ నుంచి పయనమవుతారు. 29 వరకు పర్యటన కొనసాగుతుంది. లాస్‌ ఏంజిలెస్‌తో ఆయన పర్యటన మొదలవుతుంది. 20న శాన్‌డియాగో, 21న శాన్‌జోస్‌, 24న బోస్టన్‌, 25న న్యూయార్క్‌ నగరాల్లోని ప్రసిద్ధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమై పలు కంపెనీలను సందర్శిస్తారు. ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్‌ వెంట పరిశ్రమల శాఖ అధికారుల బృందం అమెరికా వెళ్లనుంది. గత ఏడున్నరేళ్ల కాలంలో ఆయన మూడు దఫాలు అమెరికాలో పర్యటించారు. తాజా పర్యటన నాలుగోది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని