TG News: వ్యవసాయ వర్సిటీలో ఇన్‌ఛార్జులే దిక్కు

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే ఉపకులపతి సహా ప్రధాన పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా... జూన్‌ నెలాఖరుకు మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి.

Published : 04 Jul 2024 03:05 IST

పెద్ద సంఖ్యలో ఖాళీలు... నియామకాలపై నిర్లక్ష్యం

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే ఉపకులపతి సహా ప్రధాన పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా... జూన్‌ నెలాఖరుకు మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.   విశ్వవిద్యాలయ వీసీ పోస్టు 2022 జులై 25 నుంచి ఖాళీగా ఉంది. ఐఏఎస్‌ అధికారి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ అత్యంత కీలకమైంది కాగా ఆయన తీరిక లేని పనుల్లో ఉన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ పోస్టు తరచూ ఇన్‌ఛార్జులతో నడుస్తోంది. ప్రస్తుత పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా మే నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిశోధన సంచాలకునితో పాటు రిజిస్ట్రార్‌ పోస్టులకు పూర్తిస్థాయి అధికారులు ఉంటేనే విధులను నిర్వర్తించే అవకాశం ఉంది. మరోవైపు పీజీ స్టడీస్‌ డైరెక్టర్, విద్యార్థి వ్యవహారాల డైరెక్టర్, లైబ్రేరియన్‌ పోస్టులు ఖాళీగా ఉండగా... విశ్వవిద్యాలయ డీన్‌ సీమ, విస్తరణ విభాగం సంచాలకురాలు సుధారాణి జూన్‌ నెలాఖరులో పదవీ విమరణ చేశారు.  మరోపక్క విశ్వవిద్యాలయంలో ఖాళీ పోస్టుల భర్తీలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ అయినా వాటిని భర్తీ చేయడం లేదు.


సమస్యలతో సతమతం...

విశ్వవిద్యాలయ పరిధిలో కళాశాలల సంఖ్య పెరిగినా బోదన సిబ్బంది ఖాళీల వల్ల అధ్యాపకులు, సిబ్బంది నిష్పత్తి తగ్గుతోంది. విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లో ఉండగా.. దానికి బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బోధన సిబ్బంది రెండు కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. విశ్వవిద్యాలయ వైద్య కేంద్రంలో సౌకర్యాలు కరవయ్యాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సేవలందడం లేదు. దీర్ఘకాలికంగా బదిలీలు లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయ కేంద్రంలోనే అధికారులు తిష్ఠ వేస్తున్నారు. వసతి సౌకర్యాలు సరిగా లేవు. విశ్వవిద్యాలయ భూముల పరిరక్షణ కరవైంది. పరిశోధనలతో పాటు విశ్వవిద్యాలయ అవసరాలకు భూముల అవసరం ఉన్నా దానిని ఇన్‌ఛార్జి అధికారులు ప్రభుత్వానికి తెలియజేయకపోవడం వల్ల కేటాయింపులు జరుగుతున్నాయని, ఇది విశ్వవిద్యాలయ విస్తరణకు ఆటంకంగా మారిందని విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని