TG News: నేల పొరల్లోనే గంగమ్మ!

వానాకాలం ప్రారంభమై నెల దాటింది. అయినా అట్టడుగు నేల పొరలను దాటి భూగర్భజలం పైకి రావటం లేదు. ఆశించినంతగా వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాల తోడివేత పెద్ద ఎత్తున ఉండటం వల్ల జలమట్టం పెరగడం లేదు.

Updated : 08 Jul 2024 03:46 IST

ఆశాజనకంగా లేని వర్షాలు
పైకిరాని జలాలు
జూన్‌ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.90 మీటర్లు 
గతేడాదితో జూన్‌లో పోల్చితే 1.23 మీటర్ల దిగువకు..

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం ప్రారంభమై నెల దాటింది. అయినా అట్టడుగు నేల పొరలను దాటి భూగర్భజలం పైకి రావటం లేదు. ఆశించినంతగా వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాల తోడివేత పెద్ద ఎత్తున ఉండటం వల్ల జలమట్టం పెరగడం లేదు. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ నెలలో రాష్ట్ర సగటు భూగర్భజలమట్టం 9.90 మీటర్లు.గతేడాది జూన్‌ నెలతో (8.67 మీటర్లు) పోల్చితే రాష్ట్ర సగటు మట్టం 1.23 మీటర్ల దిగువకు ఉంది. నీటి వినియోగం పెరగడం, భూమిలోకి తగినంత నీరు ఇంకకపోవడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు వెలవెలబోతున్నాయి. కృష్ణా నదీతీర ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోనూ నీటి మట్టం లోతుకు చేరింది. గతేడాది ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం, కృష్ణా నదికి ప్రవాహం రాకపోవడం లాంటి కారణాలు భూగర్భ మట్టంపై ప్రభావం చూపాయి. దీంతో రైతులు పంటల సాగుకు విధిలేని పరిస్థితుల్లో బోర్లపైనే ఆధారపడ్డారు. 

8 జిల్లాల్లో మరింత లోతుకు..

గతేడాది జూన్‌తో పోల్చితే.. ఈ జూన్‌లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోనే భూగర్భ జలమట్టాలు స్వల్పంగా పెరిగాయి. ఎనిమిది జిల్లాల్లో జలమట్టాలు లోతుకు పడిపోయాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3.62 మీటర్ల లోతుకు చేరాయి. గతేడాది జూన్‌లో సగటున ఈ జిల్లాలో ఉపరితలం నుంచి భూగర్భంలో 7.30 మీటర్ల లోతులో నీటి మట్టం నమోదయింది.


ఆశల మొలకలు..  అడియాసలు అవ్వకూడదని..!

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల మల్లవ్వ అనే వృద్ధురాలు మిరప నారు అలికి ఇంటి పక్కన ఉన్న మూడు గుంటల్లో నాటుకున్నారు. కొన్ని రోజులుగా వర్షపు చినుకులు రాలకపోవడంతో ఆ మొలకలు ఎండిపోతున్నాయి. వాటిని దక్కించుకోవాలన్న ఆశతో ఇలా  పైపు ద్వారా నీటిని అందిస్తున్నారు.

న్యూస్‌టుడే, గంగాధర


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు