TG News: త్వరలో లైఫ్‌సైన్సెస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

వివిధ రంగాల పరిశోధన, అభివృధ్ధి(ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు, లైఫ్‌సైన్సెస్, మెడికల్‌ టెక్నాలజీ(వైద్యసాంకేతిక) రంగాలకు హైదరాబాద్‌ నగరం హబ్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Published : 11 Jul 2024 03:32 IST

హైదరాబాద్‌లో ఏర్పాటు... ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
మెడ్‌ట్రానిక్‌ గ్లోబల్‌ ఐటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

 మెడ్‌ట్రానిక్‌ జీఐటీ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో మెడ్‌ట్రానిక్‌ ఎస్‌వీపీ

రశ్మికుమార్, అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తదితరులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: వివిధ రంగాల పరిశోధన, అభివృధ్ధి(ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు, లైఫ్‌సైన్సెస్, మెడికల్‌ టెక్నాలజీ(వైద్యసాంకేతిక) రంగాలకు హైదరాబాద్‌ నగరం హబ్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇందుకు ప్రపంచంలోని ఏ దేశం, ప్రాంతంలో లేనివిధంగా మూడు, నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బలమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తూ వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్కులో ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్‌.. ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌(ఎంఈఐసీ)లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్‌ ఐటీ(జీఐటీ) సెంటర్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐటీతోపాటు ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ వంటి రంగాలను ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్‌లో త్వరలోనే లైఫ్‌సైన్సెస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభించనున్నాం. ఇందుకు అంతర్జాతీయ విద్యాసంస్థలతో కోర్సుల కూర్పు, ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం తదితర అంశాలపై చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రం నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కేంద్రం. తయారీ రంగంలో మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ఐటీతోపాటు అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నాం. 60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు మెడ్‌ట్రానిక్‌ ముందుకురావడం అభినందనీయం. సాంకేతిక రంగంలో మహిళా సాధికారత, సమానత్వం, సమ్మిళిత విధానాలకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించడం స్ఫూర్తిదాయకం. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం’’ అని మంత్రి అన్నారు.

సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్‌..

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ.. ‘‘సాంకేతిక ఆవిష్కరణలకు హైదరాబాద్‌ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల లభ్యత, ఉత్తమ మౌలిక వసతుల నేపథ్యంలో అమెరికా సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి’’ అని చెప్పారు.


ఐదేళ్లలో 60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి

మెడ్‌ట్రానిక్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(ఎస్‌వీపీ) రశ్మీకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘అమెరికా తర్వాత రెండో అతిపెద్ద జీఐటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. ఐదేళ్లలో 60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడంతోపాటు 300 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాం. క్లౌడ్‌ ఇంజినీరింగ్, డేటా ప్లాట్‌ఫాంలు, డిజిటల్‌ హెల్త్‌ అప్లికేషన్లు, హైపర్‌ ఆటోమేషన్‌ ఏఐ, ఎంఎల్‌ (కృతిమ మేధ, యంత్ర విద్య) వంటి ఆధునిక సాంకేతికతల అభివృద్ధిపై జీఐటీ పనిచేస్తుంది’’ అని తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శక్తినాగప్పన్, విష్ణువర్ధన్‌రెడ్డి, మాధవరావు, ఎంఈఐసీ సైట్‌ ఇన్‌ఛార్జ్, వైస్‌ ప్రెసిడెంట్‌ దివ్య ప్రకాశ్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని