local body elections: త్వరలోనే స్థానిక ఎన్నికలు

రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్‌ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది.

Updated : 10 Jul 2024 06:55 IST

ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారాస కుట్రలు
యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని పన్నాగం
నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీశ్‌రావు ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా?
సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌
ప్రధానిని కలిసేందుకు వారు దిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ

కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వేదికపై ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు


రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్‌ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. రెండు, మూడు నెలల పాటు పరీక్షలను వాయిదా వేయిస్తే రూ.100 కోట్లకు పైగా సంపాదించొచ్చనే ఆలోచనతో పలు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళనలు చేయిస్తున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డి


పాలమూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఓ ఫంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. ‘‘హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 3వేల ఓట్లే వస్తే భారాస నాయకులు.. రేవంత్‌రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు. ఇప్పుడు భారీగా ఓట్ల శాతం సాధించటంతో పాటు బూర్గుల రామకృష్ణారావు తర్వాత పాలమూరు బిడ్డ మరోసారి సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే అది కార్యకర్తల కృషి ఫలితమే. గతేడాది నుంచి కార్యకర్తలు కాంగ్రెస్‌ జెండాలను భుజాలపై మోసి అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇక స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జడ్పీ ఛైర్మన్లుగా, పుర కౌన్సిలర్లుగా, ఛైర్మన్లుగా కార్యకర్తలను గెలిపించే బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఇతర నాయకులు తీసుకుంటారు. ఇందుకు నేను రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తా’’ అని సీఎం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్నానని, ఇన్నాళ్లు తనకు సంపూర్ణ సహకారాన్ని అందించారని పేర్కొంటూ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకోవడానికే ఈ సమావేశం

కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకోవడానికి, నేరుగా మాట్లాడడానికే ఎమ్మెల్యేలకు చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ‘‘గత ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టించి పని చేసేవారికి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం. తాజాగా 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాం. అందులో పైరవీకారులు లేరు. ఎమ్మెల్యేలుగా పోటీచేయాలని భావించినా టికెట్‌ రాని వాళ్లను, అనేక ఏళ్ల నుంచి పార్టీ బలోపేతానికి కృషిచేసిన వారిని, అభ్యర్థుల విజయానికి పాటుపడిన నేతలనే ఎంపిక చేశాం. ఇప్పుడు జిల్లా స్థాయిలోని గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ కమిటీ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో నామినేటెడ్‌ పోస్టులకు పార్టీ కోసం కష్టపడిన వారినే ఎంపిక చేద్దాం. ఇందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేయాలి.

నిరుద్యోగులకు భారాస తీవ్ర అన్యాయం చేసింది

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారాస.. ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. డిసెంబరు 9వ తేదీ నాటికి గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులు, డీఎస్సీ ద్వారా 11,500 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే భారాస నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పోటీ పరీక్షలు వాయిదా పడాలని కుట్రలు పన్నుతున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏవేవో అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు. వారిద్దరు యువతను రెచ్చగొట్టడం వల్లే గతంలో చాలా మంది పేదల పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆ నేతల కుటుంబాలు మాత్రం బాగున్నాయి. ఇప్పుడు భారాస బలహీన పడింది. దాంతో వారు మళ్లీ యువతను రెచ్చగొడుతున్నారు. అందుకే నేను వారికి సవాల్‌ విసురుతున్నా. యువతను వాడుకోకుండా ఆ ఇద్దరు నేతలు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా’’ అని సీఎం  ప్రశ్నించారు. దిల్లీలో కేటీఆర్, హరీశ్‌రావు... ప్రధాని మోదీని కలవాలని నాలుగురోజులుగా చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. 

తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి 

భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ వారు అక్రమంగా తీసుకుంటున్నారని మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించటం దారుణమని సీఎం అన్నారు. ఆయన పదేళ్లలో రెండుసార్లు సీఎంగా పాలించారని, ఎన్నికలు పూర్తయిన నెల వ్యవధిలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నాడు లాక్కుపోలేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారాస, భాజపా పన్నిన కుట్రలను భగ్నం చేసి ప్రజాపాలనను అందించే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్ల నుంచి అభివృద్ధి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం పనిచేస్తుంటే కాళ్లలో కట్టె పెట్టినట్లు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


త్వరలో డీసీసీ పదవుల భర్తీ

పార్టీలో నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. త్వరలో పీసీసీ అధ్యక్షుని నియామకం జరుగుతుందని, తర్వాత డీసీసీ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో మంగళవారం కలెక్టరేట్‌లో రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్య పరిష్కారానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో పని చేయాలన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 19వేల మందిని బదిలీ చేశామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా బదిలీలు జరిగాయన్నారు. గ్రూప్‌ పరీక్షలను జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు.


పలువురు కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు పరీక్షలను వాయిదా వేయాలని మా చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పరీక్షలను వాయిదా వేస్తే రూ.వేలల్లో అప్పులు చేసి గ్రామాల నుంచి వచ్చి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నా.

సీఎం రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని