LockHeed martin: రాష్ట్రంలో ఏరోస్పేస్‌ విడిభాగాల సంస్థ పెట్టుబడులు

ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ‘ది లాక్‌హీడ్‌-మార్టిన్‌’ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది.

Published : 19 Jun 2024 06:09 IST

సీఎంతో లాక్‌హీడ్‌-మార్టిన్‌ కంపెనీ ప్రతినిధుల భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ప్రతినిధులు  

ఈనాడు, హైదరాబాద్‌: ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ‘ది లాక్‌హీడ్‌-మార్టిన్‌’ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఇండియా హెడ్‌ ఫెర్నాండేజ్‌ సహా పలువురు ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆర్నెల్లలోనే ‘స్థిరాస్తి’ గణనీయ వృద్ధి: కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ 

హైదరాబాద్‌ నగరం గత ఆరు నెలల్లో స్థిరాస్తితోపాటు లీజింగ్, ఆఫీస్, రెసిడెన్షియల్‌ స్పేస్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ పేర్కొంది. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆ సంస్థ ఆసియా పసిఫిక్‌ సీఈవో మ్యాథ్యూ భౌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా వృద్ధి చెందుతున్న విధానం, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా చర్చించారు. ‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే మా నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుంది’’ అని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ సంస్థ తమ అధ్యయన వివరాలను పంచుకుంది. అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడుతూ... ‘‘మా ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, ప్రాంతీయ రింగు రోడ్డు, మెట్రో రైలు మార్గం విస్తరణతో హైదరాబాద్‌ మరింత అద్భుతంగా తయారవుతుంది. మేం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదు. హైదరాబాద్‌ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది మా సంకల్పం. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడికి వెళ్లి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకే న్యూయార్క్‌తో పోల్చుకునేలా ఈ మహానగరాన్ని తీర్చిదిద్దాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని