Indian railways: ప్రయాణికులకు చేరువగా దూర ప్రాంత రైళ్లు

శిర్డీ, జైపుర్‌, హుబ్బళ్లి వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలంటే ఇకపై విజయవాడ, సికింద్రాబాద్‌ వంటి పెద్ద రైల్వేస్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి.

Updated : 10 Dec 2022 07:26 IST

జైపుర్‌ రైలు కర్నూలు నుంచి.. విజయవాడ-శిర్డీ ఎక్స్‌ప్రెస్‌ మచిలీపట్నం నుంచి..

ఈనాడు, హైదరాబాద్‌: శిర్డీ, జైపుర్‌, హుబ్బళ్లి వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలంటే ఇకపై విజయవాడ, సికింద్రాబాద్‌ వంటి పెద్ద రైల్వేస్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి. మచిలీపట్నం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ వంటి జిల్లా కేంద్రాల నుంచే ఈ రైళ్ల ప్రయాణం మొదలవనుంది. మొత్తం 10 జత (రాను, పోను)ల దూరప్రాంత రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు ఏడు జోన్ల అధికారులకు తెలిపింది. మూడేళ్లుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనలపై ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించడంతో తాజాగా ఈ నిర్ణయం వెలువడింది.

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే జైపుర్‌ రైలు (19713/19714)కు ఏపీలోని కర్నూలును ప్రారంభ స్థానంగా మార్చారు. దీంతో కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ ప్రాంతవాసులకు ప్రయోజనం చేకూరనుంది.

విజయవాడ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌, వికారాబాద్‌ మీదుగా సాయినగర్‌ శిర్డీ (17207/17208) వెళ్లే రైలు ఇక మచిలీపట్నం నుంచి బయల్దేరనుంది. దీంతో మచిలీపట్నంతో పాటు గుడివాడ, గుడ్లవల్లేరు, పెడన వాసులకు ప్రయోజనం. ధర్మవరం-విజయవాడ రైలు (17215/17216) ఇకపై మచిలీపట్నంవరకు రాకపోకలు సాగిస్తుంది.

కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ (17225/17226)కు వచ్చిపోయే రైలును నరసాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు నుంచి కూడా హుబ్బళ్లికి వెళ్లి రావచ్చు.

విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ (12861/12862)ను మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించారు. దీనివల్ల మహబూబ్‌నగర్‌, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల వాసులకు ప్రయోజనం.

విశాఖపట్నం- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ (22701/22702)ను గుంటూరు వరకూ పొడిగించారు.తాండూరు-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ రైలు (17663/17664)ను కర్ణాటకలోని రాయచూరుకు పొడిగించారు.

మహారాష్ట్రలోని హడాప్సర్‌ (పుణె)-హైదరాబాద్‌ (17013/17014) రైలును కాజీపేట వరకు పొడిగించారు. అదనంగా సికింద్రాబాద్‌, భువనగిరి, జనగామ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

నంద్యాల-కడప ప్యాసింజర్‌ (77401/77402)ను రేణిగుంట వరకు పొడిగించారు. దీంతో ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబుళవారిపల్లె, కోడూరు, బనగానపల్లి వాసులకు ప్రయోజనం కలగనుంది.

నిజామాబాద్‌-కరీంనగర్‌ ప్యాసింజర్‌ (77259/77260)ను బోధన్‌ వరకు పొడిగించారు. దీంతో జానకంపేట, గాంధీపార్క్‌ స్టేషన్లలో అదనంగా ఈ రైలు ఆగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని