IAS Transfers: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇచ్చింది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది.

Updated : 25 Jun 2024 06:15 IST

42 మందికి స్థానచలనం
ఇద్దరు ఐపీఎస్‌లకు కూడా..
విద్యుత్‌ శాఖకు రొనాల్డ్‌ రాస్‌
ఆర్థిక శాఖకు సందీప్‌కుమార్‌ సుల్తానియా
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌కు ఎస్‌ఏఎం రిజ్వీ
త్వరలో మరికొన్ని బదిలీలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇచ్చింది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తంగా 42 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కల్పించారు. 

దేవాదాయ, చేనేత, జౌళి, హస్తకళల శాఖకు ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించారు. వీటికి అదనంగా చేనేత, జౌళి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అదనంగా ప్రణాళిక శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. వీటితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కొత్త ఐఏఎస్‌ను నియమించేవరకూ ఆ బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా ఉన్న సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖకు బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న రొనాల్డ్‌ రాస్‌ను విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా నియమించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, హౌసింగ్‌ శాఖలకు కార్యదర్శిగా నియమించారు. అదనంగా రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్‌ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా.. సర్వే సెటిల్‌మెంట్స్, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌గా.. భూభారతి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్‌ కలెక్టర్‌గా పమేలా సత్పతిని కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఐపీఎస్‌ అధికారుల్లో ఏవీ రంగనాథ్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా.. ఈ స్థానంలో కొనసాగుతున్న న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డిని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. ప్రస్తుతం టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న కె.రమేశ్‌బాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. మొత్తంగా ఒకే విడతలో 44 మందికి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న వికాస్‌రాజ్, అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న లోకేశ్‌కుమార్‌లను కూడా మార్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో మరికొందరు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని