Hyderabad: మలక్‌పేట మార్కెట్టూ కోహెడకే

మలక్‌పేటలోని మిరప మార్కెట్‌ను కోహెడలో ఏర్పాటుచేసే నూతన పండ్ల మార్కెట్‌లోకి తరలించడానికి అవసరమైన వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.

Published : 15 Oct 2022 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: మలక్‌పేటలోని మిరప మార్కెట్‌ను కోహెడలో ఏర్పాటుచేసే నూతన పండ్ల మార్కెట్‌లోకి తరలించడానికి అవసరమైన వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన పండ్లమార్కెట్‌ నిర్మాణంపై రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై శుక్రవారం తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. మాడ్రిడ్‌ (స్పెయిన్‌), రుంగిస్‌ (ఫ్రాన్స్‌) వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అధునాతన వసతులు, ఉత్తమ విధానాలు పరిగణనలోకి తీసుకుని కోహెడ మార్కెట్‌ నిర్మించాలని సూచించారు. పంటల వేలం జరిగే రేకులషెడ్లలో ఊష్ణోగ్రతలు తగ్గించేందుకు, పండ్ల నిల్వ కాలపరిమితి (షెల్ఫ్‌ లైఫ్‌) పెంచే సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుచేయాలన్నారు. మొత్తం మార్కెట్‌లో పంటల వేలం నిర్వహణకు 11 భారీ షెడ్లు నిర్మిస్తారు. పండ్లు, ఎండు మిర్చి, ఉల్లిగడ్డ కొనే కమీషన్‌ ఏజంట్లు, వ్యాపారులకు 820 దుకాణాలు నిర్మించాలని సూచించారు. పండ్ల మార్కెట్‌ కోసం 78.78, శీతల గిడ్డంగుల నిర్మాణానికి 20 ఎకరాలు, ఎగుమతుల మార్కెటింగ్‌ ప్రత్యేక వసతులకు 19.75, ఎండు మిర్చి మార్కెట్‌కు 27.35,  ఇతర వసతుల కోసం 73.24 ఎకరాలు కేటాయించారు. మామిడి మార్కెట్‌ మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ఇర్రేడియేషన్‌ మరియు వేపర్‌హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే, విదేశీ ఎగుమతులకు వీలవుతుందని సూచించారు. ఎగుమతులకు సంబంధించిన సర్టిఫికేషన్‌ జారీ ఆఫీసుల ఏర్పాటుకు అవసరమైన నిర్మాణం చేపట్టాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని