Coal Mines: వేలంలో శ్రావణపల్లి సహా 60 బొగ్గు గనులు

తెలంగాణలోని శ్రావణపల్లి సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 60 బొగ్గు గనుల వేలం పాటల నిర్వహణ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Published : 22 Jun 2024 04:11 IST

సింగరేణి టెండరు వేయక తప్పదా?
నేరుగా గని కేటాయింపుపై స్పష్టత ఇవ్వని కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని శ్రావణపల్లి సహా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 60 బొగ్గు గనుల వేలం పాటల నిర్వహణ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ గనుల్లో ఎన్ని లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి, వాటి తవ్వకాలకు సంబంధించిన విధివిధానాలను బొగ్గుశాఖ అధికారులు వివరించారు. పెట్టుబడులు పెట్టగలిగే వారెవరైనా వేలంలో టెండరు వేయవచ్చని వారు చెప్పారు. బొగ్గు తవ్వకాల్లో ఎలాంటి అనుభవం అవసరం లేదని, ఆర్థిక సామర్థ్యం మాత్రమే చూస్తామని స్పష్టం చేశారు. టెండర్ల దాఖలుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. తెలంగాణలో ఉన్న గనులను సింగరేణికి నేరుగా కేటాయించే అంశంపై ప్రధానితో మాట్లాడి చెబుతామని కిషన్‌రెడ్డి తెలిపారు. నేరుగా కేటాయించకపోతే శ్రావణపల్లి గని కోసం సింగరేణి కూడా టెండరు వేయక తప్పదు. వేలంలో కొనే గనిలో ఉత్పత్తి చేసే బొగ్గుపై రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ ఎంత చెల్లిస్తారనే ప్రతిపాదనను బట్టి కేంద్రం కేటాయిస్తుంది. ఈ రాయల్టీ మొత్తాన్ని ప్రైవేటు కంపెనీలు ఎక్కువ కోట్‌ చేసే అవకాశాలున్నాయి. పోటీ పడాలంటే సింగరేణి కూడా అధిక రేట్లను కోట్‌ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ గనిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికమై.. విక్రయ ధరలను పెంచక తప్పదు. ఫలితంగా దాన్ని కొనే విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి వ్యయం కూడా పెరిగి.. కరెంటు ఛార్జీలను పెంచాల్సి వస్తుంది. ఈ భారం తగ్గాలంటే నేరుగా గనులు కేటాయించాలని సింగరేణి సంస్థ కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని