Damodar Raja Narasimha: ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు

రాష్ట్రంలో ఆహారకల్తీలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు.

Published : 12 Jun 2024 04:35 IST

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆహారకల్తీలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో ఆహార నాణ్యత ప్రమాణాల కమిషనర్‌ నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీలకు అవకాశం లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హోటళ్ల యజమానులకు సూచించారు. ఆహార కల్తీ చేసే వారితో పాటు నాణ్యత పాటించని వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతున్నామని, ఆహారం నాణ్యత ప్రమాణాలపై ప్రతి ఆరు నెలలకోసారి వర్క్‌షాప్‌తో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తుంచుకోవాలని మంత్రి పేర్కొన్నారు. హోటళ్ల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్, డైరెక్టర్‌ శివలీల, తెలంగాణ రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌రెడ్డి, ఇండియన్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సందీప్, ఇండియన్‌ డైరీ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ సుల్తాన్‌ మస్కతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని