Komati Reddy: ప్రాంతీయ రింగు రోడ్డుతో పెట్టుబడుల వెల్లువ!

‘‘అవుటర్‌ రింగు రోడ్డు నిర్మాణంతో రాష్ట్రానికి గతంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పూర్తయితే మరోదఫా పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చి... హైదరాబాద్‌ పెట్టుబడుల హబ్‌గా మారుతుంది.

Published : 20 Jun 2024 03:35 IST

అవుటర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య అనుసంధాన మార్గాలు
రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిత్రంలో ఉన్నతాధికారులు మోహన్‌ నాయక్, గణపతిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘అవుటర్‌ రింగు రోడ్డు నిర్మాణంతో రాష్ట్రానికి గతంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పూర్తయితే మరోదఫా పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చి... హైదరాబాద్‌ పెట్టుబడుల హబ్‌గా మారుతుంది. అప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి’’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో, తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘మాది జవాబుదారీ(అకౌంటబులిటీ) ప్రభుత్వం. లెక్కల(అకౌంట్స్‌)తో మాకు సంబంధం లేదు. లెక్కలే పరమావధిగా వ్యవహరించిన మునుపటి ప్రభుత్వానికి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. మేం ఆర్‌ఆర్‌ఆర్‌ను రానున్న మూడున్నరేళ్లలో కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండు రింగు రోడ్ల మధ్య రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్డు నిర్మాణ మార్గంలోని కేబుళ్లు, పైపులైన్లు తదితరాల(యుటిలిటీస్‌) తరలింపు వ్యయాన్ని భరించేందుకు నిరాకరించడంతో పనులు ప్రశ్నార్థకంగా మారాయి. మేం వచ్చాక సంబంధిత రూ.340 కోట్లను చెల్లిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయడంతో పనులు ముందుకు సాగుతున్నాయి. 

రోడ్లు పాడైతే ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు 

రహదారులు ధ్వంసమైతే ప్రజలు... ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు. రోడ్లు దెబ్బతింటే గుత్తేదార్లతోపాటు అధికారులూ బాధ్యులే. ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు వస్తే చర్యలు తప్పవు. మరిన్ని రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్రం అనుమతి కోరనున్నాం. ఇప్పటికే జరుగుతున్న హైవేల పనులకు గడువును నిర్దేశించుకుని పూర్తి చేయాలి. గుత్తేదారు దివాలా తీస్తే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. హైదరాబాద్‌లోని గోల్నాక-అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. దానిపై నెలరోజుల్లో రాకపోకలను అనుమతిస్తాం. ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ను గత ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా నిర్మించలేకపోయింది. కేవలం దుర్గంచెరువు వద్ద వంతెన కట్టేందుకే ప్రాధాన్యమిచ్చింది. శుద్ధి చేయని నీటిని చెరువులోకి వదలడంతో అక్కడ దుర్గంధం వస్తోంది. 

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని 2022లోనే ఆరు వరుసల్లో విస్తరించాల్సి ఉండే. రాష్ట్ర విభజనతో ట్రాఫిక్‌ తగ్గిందని, టోల్‌ వసూలు వ్యవధిని పెంచాలని జీఎమ్మార్‌ సంస్థ కోర్టులో వ్యాజ్యం వేసింది. బ్లాక్‌స్పాట్లను చక్కదిద్దేందుకు టెండర్లు పిలిస్తే వాటిపైనా కోర్టుకెళ్లింది. న్యాయస్థానం అనుమతించడంతో చివరికి టెండర్లు ఆమోదం పొంది, పనులు మొదలయ్యాయి. ఈ మార్గంలో రెండు పెద్ద ఫ్లైఓవర్లను నిర్మించేందుకు త్వరలో శంకుస్థాపన చేస్తాం. 

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం 

ఉస్మానియా ఆస్పత్రిని ఇప్పుడున్న చోటే నిర్మించేందుకు మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తాం. వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం. హైకోర్టు భవనాల నిర్మాణానికీ చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నిర్మాణానికి నగరంలోని పాటిగడ్డలో త్వరలో శంకుస్థాపన చేస్తాం. 

దిల్లీలో 24 అంతస్తుల్లో తెలంగాణ భవన్‌ 

మునుపటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో దేశ రాజధానిలో మనకంటూ సొంత భవనం కరవైంది. ఏపీ అధికారులతో సంప్రదించి, ఏపీభవన్‌లో మనకు రావాల్సిన 42% వాటా భూమిని తీసుకోవడానికి నేనే చొరవ తీసుకున్నా. దిల్లీలో త్వరలో 24 అంతస్తుల్లో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తాం. 

25, 26 తేదీల్లో దేశ రాజధానికి... 

రాష్ట్రానికి సంబంధించిన వివిధ రోడ్లకు అనుమతుల కోసం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసేందుకు ఈనెల 25, 26 తేదీల్లో దిల్లీ వెళ్లనున్నాం. రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులు, భూముల సేకరణ కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌ను కూడా కలుస్తా’’ అని వివరించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు గణపతిరెడ్డి, సతీష్, మోహన్‌నాయక్‌ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని