Anganwadi Centers: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమం

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Published : 14 Jun 2024 06:18 IST

చిన్నారులకు నర్సరీ విద్య
రాష్ట్ర మంత్రి సీతక్క

బండారుపల్లి మోడల్‌ స్కూల్‌లో అంగన్‌వాడీ చిన్నారితో మంత్రి సీతక్క

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లిలోని మోడల్‌ స్కూల్‌లో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి మంత్రి అంగన్‌వాడీ చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం నుంచి ఆంగ్లంలో బోధన అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ పర్యవేక్షణలో వేసవిలోనే ప్రణాళిక రూపొందించి దుస్తులు, పాఠ్యపుస్తకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం మాత్రమే పెట్టేవారని, ఇప్పుడు నర్సరీ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. పాఠ్య పుస్తకాలు, దుస్తుల పంపిణీని కూడా ప్రారంభించామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ పేరుతో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ విద్యను అందిస్తామన్నారు. పేదలందరికీ ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, భోజనం తదితర సౌకర్యాలు అందుతున్నట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నారు. మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని మంత్రి సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.శ్రీజ, ఆర్డీవో సత్యపాల్‌ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, డీఈవో జి.పాణిని, డీఎస్పీ రవీందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని