Thummala: ‘రైతుభరోసా’పై అభిప్రాయ సేకరణ: మంత్రి తుమ్మల ఆదేశం

తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌ నుంచి ప్రారంభించనున్న రైతుభరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

Updated : 25 Jun 2024 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌ నుంచి ప్రారంభించనున్న రైతుభరోసా పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో 110 నియోజకవర్గాల్లోని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు జరగనున్నాయి. ఆ నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి రైతులను రైతువేదికలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలియజేసేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. అనంతరం వాటిని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు పథకం స్థానంలో ‘రైతుభరోసా’ను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘రైతుబంధు’ నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాలతో ‘భరోసా’ను అమలుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. రైతులు, వివిధ వర్గాలవారి అభిప్రాయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవలి మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. అర్హులకు మాత్రమే ప్రజాధనం అందాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం రైతుభరోసా విధివిధానాలను ఖరారు చేయనుందని మంత్రి తుమ్మల సోమవారం తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన  అభిప్రాయాలు, సూచనలను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేస్తామని వివరించారు.

కటింగ్‌ మాస్టర్‌ కాదు.. కరెక్టింగ్‌ మాస్టర్‌

సీఎం అంటే కటింగ్‌ మాస్టర్‌ కాదని.. కరెక్టింగ్‌ మాస్టర్‌ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రుణమాఫీ, రైతుభరోసా అమలుపై భారాస నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని, వీటిని పారదర్శకంగా, ఆదర్శంగా అమలుచేయాలన్న ఉద్దేశంతోనే ఆలస్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాలని భారాస శ్రేణులకు హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని