MLC Elections: సుదీర్ఘ కసరత్తు

ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. ఒకటి, రెండు స్థానాలపై చివరి

Updated : 09 Aug 2022 12:06 IST

చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు
అధికారికంగా వెల్లడికాని తెరాస జాబితా
పార్టీ అభ్యర్థులకు సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. ఒకటి, రెండు స్థానాలపై చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి పేరు సైతం పరిశీలనకు వచ్చింది. గవర్నర్‌ కోటాలో ఆయన ఎంపిక విషయమై చర్చించినట్లు తెలిసింది. వడబోత అనంతరం జాబితాను ఖరారు చేసిన ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌..అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారిని మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఒక స్థానానికి అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఉదయం నుంచే సీఎం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిలతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తదితరులు ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు మంతనాల అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఖరారయిన అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సమాచారం అందింది. పోటీ తీవ్రంగా ఉన్నందున ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ అధిష్ఠానం ఆచితూచి కసరత్తు చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కడియం శ్రీహరి, కౌశిక్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మధుసూదనచారి, ఆకుల లలిత తదితరుల పేర్లను పరిశీలించింది.  

నామినేషన్లకు నేడు చివరి రోజు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. ఈనెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరోజు లెక్కింపు జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు మంగళవారం నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. డిసెంబరు 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని