Ramoji Rao: జాలిపడేలా కాదు.. ఈర్ష్యపడేలా ఎదగాలన్న రామోజీరావు

జాలిపడేలా కాకుండా ఎదుటివారు ఈర్ష్యపడేలా ఎదగాలన్న జీవిత సత్యాన్ని చెప్పి.. ఆచరించి చూపిన స్ఫూర్తిప్రదాత రామోజీరావు అని సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అన్నారు.

Published : 17 Jun 2024 04:47 IST

సంస్మరణ సభలో మురళీమోహన్‌

రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతున్న మురళీమోహన్‌. చిత్రంలో ఎం.నాగేశ్వరరావు, 
జస్టిస్‌ చల్లా కోదండరాం, మేకా రామకృష్ణ, త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, నిమ్మగడ్డ రమేశ్, మేడసాని మోహన్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: జాలిపడేలా కాకుండా ఎదుటివారు ఈర్ష్యపడేలా ఎదగాలన్న జీవిత సత్యాన్ని చెప్పి.. ఆచరించి చూపిన స్ఫూర్తిప్రదాత రామోజీరావు అని సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా భయపడకుండా నీతి, నిజాయతీ, నిబద్ధతలతో ఎదుర్కొన్నారన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట కమ్మ సంఘం హాలులో ఆదివారం జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో మురళీమోహన్‌ మాట్లాడారు. పత్రిక, టీవీ ఛానళ్లు, ప్రపంచం మెచ్చిన ఫిల్మ్‌ సిటీ, ఎవరూ వేలెత్తి చూపని మార్గదర్శి సంస్థల నిర్వహణతోపాటు ఆదర్శవంతమైన చిత్రాల నిర్మాణం వెనుక రామోజీరావు కృషి ఎంతో ఉందన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. టెలికాం రంగ నిపుణులు త్రిపురనేని హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ.. రామోజీరావు విభిన్న వ్యాపారాల ద్వారా వేల మందికి ఉపాధి కల్పించారని, జర్నలిజం స్కూల్‌ను ప్రారంభించడం ద్వారా వార్తారచనలో నాణ్యతా ప్రమాణాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం మాట్లాడుతూ.. రామోజీరావు ఆర్థిక క్రమశిక్షణ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సమాజానికి మంచి భాష, మంచి సంస్కారం ‘ఈనాడు’ ద్వారా రామోజీరావు వ్యాప్తి చేశారన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగు భాషకు రామోజీరావు ఎంతో సేవ చేశారని, భాష అస్తిత్వం కోల్పోకుండా కాపాడుకోవడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులు అర్పించవచ్చన్నారు. కార్యక్రమంలో అమీర్‌పేట కమ్మ సంఘం కార్యదర్శి మేకా రామకృష్ణ, నాదెండ్ల శివనాగేశ్వరరావు, మేడసాని మోహన్, మన్నవ కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంతాపంగా మౌనం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని