Blood Tests: చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.

Updated : 17 Jun 2024 07:19 IST

సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్, సైన్‌ వి
యాంటీ బయాటిక్స్‌ వినియోగాన్ని నియంత్రించే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో పదివేల మందిపై ప్రయోగాత్మక పరిశీలన

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు ఏఎంఆర్‌ఎక్స్‌ అని నామకరణం చేశాయి. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణుడు తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధిని ఎలా విశ్లేషిస్తారో అలాగే చేస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా తార్కికంగా ఆలోచిస్తాయో అలాగే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఫలితాలు తక్షణమే వస్తాయి కాబట్టి అనవసరంగా యాంటీ బయాటిక్‌ ఔషధాల వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చాలా మంది వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీ బయాటిక్‌ ఔషధాలను వాడిస్తూ... నివేదికలు వచ్చిన తర్వాత అసలు యాంటీ బయాటిక్స్‌ అవసరమా, తగ్గించాలా, పెంచాలా అని నిర్ణయిస్తున్నారు.


చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్యనిపుణులు వాటిని రాసుకుని... ఆ సమాచారమంతా ఈ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఒక్క చుక్క రక్తం కూడా అవసరం లేదు. క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది. ఏఎంఆర్‌ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదివేల రోగుల పరిస్థితులను పరిశీలించారు. ఒకపక్క వారి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. మరోపక్క ఆ రోగులు చెప్పిన అనారోగ్య లక్షణాలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా సోకుతున్న జబ్బులు, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. ఆ ఫలితాలను.. సంప్రదాయ పద్ధతిలో రోగి నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల పరీక్షల ఫలితాలను వైద్య నిపుణులు విశ్లేషించగా రెండూ ఒకేలా ఉన్నాయి. పరిశోధనల ఫలితాలను గతేడాది ఎథిక్స్‌ కమిటీకి నివేదించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించవచ్చంటూ ఆరునెలల క్రితం ఐసీఎంఆర్‌ అనుమతి లభించడంతో పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.


క్షణాల్లో ఫలితాలు

చిన్న జబ్బులతో ఇబ్బందులు పడుతున్నవారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యులు యాంటీబయాటిక్‌ మందులు ఇస్తున్నారు. మందులు ఇచ్చేముందు రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఏఎంఆర్‌ఎక్స్‌ సాఫ్ట్‌వేర్‌ రోగి లక్షణాల ఆధారంగా రోగ నిర్ధారణ చేస్తుంది. క్షణాల్లో ఫలితాలు వస్తాయి.

డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, హైదరాబాద్‌


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని