Phone Tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అభియోగపత్రాన్ని తిప్పిపంపిన కోర్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు అభ్యంతరం వ్యక్తంచేస్తూ రెండు రోజుల క్రితం తిప్పి పంపింది.

Updated : 21 Jun 2024 05:41 IST

మార్పులు చేర్పులతో తిరిగి దాఖలు చేసిన సిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దాఖలు చేసిన ప్రాథమిక అభియోగపత్రంపై నాంపల్లి కోర్టు అభ్యంతరం వ్యక్తంచేస్తూ రెండు రోజుల క్రితం తిప్పి పంపింది. దీంతో మరోసారి మార్పులు చేర్పులతో సిట్‌ తాజాగా అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, జూన్‌ రెండో వారంలో అభియోగపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, ఏ2గా ప్రణీత్‌రావు, ఏ3గా తిరుపతన్న, ఏ4గా భుజంగరావు, ఏ5గా రాధాకిషన్‌రావు, ఏ6గా శ్రవణ్‌రావును పేర్కొన్నారు. ఈ మేరకు 69 పేజీలతో కూడిన అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. 68 మంది సాక్షులను విచారించినట్లు అందులో పేర్కొన్నారు. వందల పేజీల డాక్యుమెంట్లను సమర్పించారు. అయితే ఈ అభియోగపత్రంలో పేర్కొన్న వివరాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ న్యాయస్థానం వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. సాధారణంగా ఏదైనా కేసులో 90 రోజుల్లోపు అభియోగపత్రం దాఖలు చేయకపోతే నిందితులు మ్యాండేటరీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రణీత్‌రావు ఈ అంశంపైనే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ క్రమంలో సిట్‌ వెంటనే సరిచేసిన అభియోగపత్రాన్ని కోర్టుకు తిరిగి సమర్పించింది. అలాగే ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్‌పైనా బుధవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అతని పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అభియోగపత్రాన్ని తిప్పి పంపడం అరుదుగా జరుగుతుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ సంచలనాత్మక కేసు కావడంతో అభియోగపత్రాన్ని కోర్టు తిప్పి పంపడం చర్చనీయాంశంగా మారింది. కాగా తిరిగి సమర్పించిన అభియోగపత్రంలో ఎలాంటి మార్పులు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇంతవరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్‌ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్లు ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు