Niloufer Hospital: నిలోఫర్‌లో ఎంఆర్‌ఐ యంత్రం లేదు

నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రి దేశంలోని ప్రముఖ.. పిల్లల ఆసుపత్రుల్లో ఒకటి. 1200 పడకలున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వేయి మందికి పైగా చిన్నారులకు ఓపీ చికిత్సలతో పాటు గర్భిణులకు సంక్లిష్టమైన డెలివరీలు చేస్తుంటారు.

Published : 08 Jul 2024 03:25 IST

అతిపెద్ద చిన్నపిల్లల ఆసుపత్రిలో పరిస్థితి ఇది

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రి దేశంలోని ప్రముఖ.. పిల్లల ఆసుపత్రుల్లో ఒకటి. 1200 పడకలున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వేయి మందికి పైగా చిన్నారులకు ఓపీ చికిత్సలతో పాటు గర్భిణులకు సంక్లిష్టమైన డెలివరీలు చేస్తుంటారు. వ్యాధుల సీజన్‌లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటోంది. అంతటి కీలకమైన ఈ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రం లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. వివిధ న్యూరో సమస్యలతో వచ్చే చిన్నారులకు సకాలంలో వైద్య చికిత్సలు అందక ప్రాణాల మీదకు వస్తోంది. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ బయట చేయించుకునే ఆర్థిక స్థోమత లేని చిన్నారుల తల్లిదండ్రులు ఎంఎన్‌జేలో ఈ స్కానింగ్‌ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం 20 మందికిపైనే చిన్నారులు ఈ స్కానింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా ఇదే తంతు నడుస్తోంది. రూ.10 కోట్లతో యంత్రం కొనుగోలుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు.  

వారానికి రెండు స్లాట్లు కేటాయిస్తున్న ఎంఎన్‌జే  

నిలోఫర్‌ పక్కనే ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ఉంది. నిలోఫర్‌కు వచ్చే చిన్నారులకు ఎంఆర్‌ఐ పరీక్షలు అవసరమైతే ఎంఎన్‌జేకు పంపుతున్నారు. అక్కడ నిత్యం వందల సంఖ్యలో క్యాన్సర్‌ రోగుల తాకిడి ఉంటోంది. దీంతో నిలోఫర్‌ చిన్నారుల కోసం వారానికి రెండు స్లాట్లు కేటాయిస్తున్నారు. ఫిట్స్, బ్రెయిన్‌ ట్యూమర్లు, బ్రెయిన్‌ ఫీవర్లతో నిలోఫర్‌లో చేరే చిన్నారులకు మెదడులోని సమస్యను గుర్తించేందుకు ఎంఆర్‌ఐ స్కాన్‌ తప్పనిసరి. రోజుకు ముగ్గురు, నలుగురు చిన్నారులు న్యూరో సమస్యలతో నిలోఫర్‌లో చేరుతుండగా ఎంఎన్‌జేలో వారానికి నాలుగుకు మించి స్కానింగ్‌లు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటులో స్కానింగ్‌ కోసం తక్కువలో తక్కువ రూ.6-7 వేలు వసూలు చేస్తుండటంతో.. అంత స్థోమత లేని తల్లిదండ్రులు.. తమవంతు వచ్చే వరకు ఆసుపత్రిలోనే చిన్నారులతో వేచిఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని