stray dog attacks: వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు

వీధి కుక్కల నియంత్రణకు ఏంచేశారన్న విషయమై.. గణాంకాలు కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారన్నదే అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 11 Jul 2024 03:14 IST

ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం
గణాంకాలు కాదు.. చర్యలు కావాలి
నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలి
హైకోర్టు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వీధి కుక్కల నియంత్రణకు ఏంచేశారన్న విషయమై.. గణాంకాలు కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారన్నదే అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవైపు పిల్లలు చనిపోతుంటే.. మీరేమో ‘కౌంటర్‌ దాఖలు చేశాం.. జూబ్లీహిల్స్‌లో 350, బంజారాహిల్స్‌లో 250 కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేశాం.. అదనపు కౌంటరు దాఖలు చేస్తాం..’ అని గడువు తీసుకుంటూ వెళ్లడం సరికాదంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ లాంటి ఖరీదైన కాలనీల్లో సంఘటనలు జరగడం లేదని, పేదలు నివసిస్తున్న మురికివాడలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ వ్యవహారాన్ని ఒక కేసుగా చూడకుండా మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. నిపుణులతో కమిటీని వారంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదని, వాటికి వ్యాక్సినేషన్‌ చేయడం లేదని, ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య ప్రజాప్రయోజన వ్యాజ్యం వేేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్‌ బాగ్‌అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనికి అనుబంధంగా ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బిహార్‌ నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మిక దంపతుల 6 ఏళ్ల కుమారుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తరచూ ఈ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయన్నదాన్ని పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొత్త నిబంధనలు రూపొందించామని, జీహెచ్‌ఎంసీ పరిధి కాకపోయినా సంగారెడ్డిలో కుక్కల దాడి సంఘటనపై స్పందించి కలెక్టర్‌కు చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని, పిల్లలు చనిపోతున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. ఉదాసీనతను సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, చర్యలు తీసుకోని పక్షంలో ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు కార్యాచరణ ప్రణాళికను చెప్పాలని జీహెచ్‌ఎంసీ తదితరులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని