Omicron: ఏపీలో ఒమిక్రాన్‌ తొలి కేసు

రాష్ట్రంలో ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ఎస్‌.కోట మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ఐర్లాండ్‌లోని

Updated : 23 Feb 2024 11:36 IST

విజయనగరం జిల్లా వాసికి నిర్ధారణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ఎస్‌.కోట మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ఐర్లాండ్‌లోని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో పని చేస్తున్నారు. ఆయన ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా విశాఖ వచ్చారు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. నమూనాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్‌గా తేలినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు హైమావతి వెల్లడించారు.  


దేశంలో 38కి చేరిన కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆదివారం 38కి పెరిగింది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌లలో తొలిసారి ఒక్కో కేసు చొప్పున నమోదవగా.... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొత్తగా మరో రెండు కేసులు బయటపడ్డాయి. ఈ ఐదుగురూ ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారే.


విదేశీ ప్రయాణికుల్లో ఒకరికి పాజిటివ్‌

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుల్లో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆదివారం 791 మంది విదేశాల నుంచి రాగా వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడంతో ఒకరికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. ఒమిక్రాన్‌ వేరియంటా..? అనేది నిర్ధారించేందుకు ఆ నమూనాను ప్రయోగశాలకు పంపించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన మొత్తం 4558 ప్రయాణికుల్ని పరీక్షించగా 17 మంది పాజిటివ్‌గా రావడంతో నమూనాల్ని ప్రయోగశాలకు పంపించారు. వీరిలో 13 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ రాగా.. తాజా నమూనాతో కలిపి నాలుగింటి ఫలితం రావాల్సి ఉందని బులెటిన్‌ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 146 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 6,78,288కి చేరింది. మహమ్మారి బారినపడి ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4007కు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని