Paddy: ప్రత్యామ్నాయం తప్పదు

కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లు రాష్ట్రంలో ఉప్పుడు (బాయిల్డ్‌) బియ్యం తీసుకోరాదని నిర్ణయించినందున.. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు.

Updated : 28 Nov 2021 05:25 IST

యాసంగిలో వరిసాగు వద్దు
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లు రాష్ట్రంలో ఉప్పుడు (బాయిల్డ్‌) బియ్యం తీసుకోరాదని నిర్ణయించినందున.. రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు.. అవి ధాన్యాన్ని తీసుకుంటాయనే సొంత పూచీ ఉంటేనే వరిని పండించాలని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, సంబంధిత అంశాలపై చర్చించారు. సీఎస్‌ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యం పారాబాయిల్డ్‌ బియ్యానికే అనుకూలం. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో రైతులు అప్రమత్తం కావాలి. రెండో పంటగా వరి సాగు వద్దు. వానాకాలంలోనూ 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్నే కొనుగోలు చేస్తామని కేంద్రం తెలిపింది. మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతమయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్లకు సరిపడా స్థలం ఉంటుంది. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించి సమస్యలను పరిష్కరించాలి. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఇది రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. దీనిపై కలెక్టర్లు, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని సీఎస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని