Parboiled rice: ఉప్పుడు బియ్యం కొనం

రాష్ట్రాల నుంచి ఇక మీదట ఉప్పుడు(బాయిల్డ్‌ రైస్‌) బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వడ్లు, బియ్యం కొనాలంటూ తెలంగాణలో ఆందోళన నేపథ్యంలో శాఖ వర్గాలు పలు అంశాలపై

Updated : 19 Nov 2021 04:26 IST

అంచనాలకు మించి వరి, గోధుమ ఉత్పత్తి
పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
నూనె గింజలు, పప్పుల సాగును ప్రోత్సహించాలి
కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ వెల్లడి

ఈనాడు, దిల్లీ: రాష్ట్రాల నుంచి ఇక మీదట ఉప్పుడు(బాయిల్డ్‌ రైస్‌) బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వడ్లు, బియ్యం కొనాలంటూ తెలంగాణలో ఆందోళన నేపథ్యంలో శాఖ వర్గాలు పలు అంశాలపై తమ వైఖరిని వెల్లడించాయి. ‘‘కేరళ, తమిళనాడు, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల్లో గతంలో ఉప్పుడు బియ్యం వినియోగం ఎక్కువగా ఉండేది. అది ప్రస్తుతం తగ్గిపోయింది. తమకు అవసరమున్నంత మేర ఆ రాష్ట్రాలే సేకరించుకుంటున్నాయి. ఏటా ఖరీఫ్‌(వానాకాలం) పంటకాలం ఆరంభంలోనే ఏ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎంత.. ఉత్పత్తి ఎంత.., కేంద్రం ఎంత సేకరించాలనే దానిపై ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్ణయిస్తాం. దీనికి అనుగుణంగా సేకరణ, కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. వానాకాలం పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల(ఎల్‌ఎంటీ) బియ్యం సేకరించాలని ఆగస్టు 17న కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందానికి వచ్చారు. తర్వాత కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమై.. 90 ఎల్‌ఎంటీ బియ్యం కొనాలని కోరారు. ఆ రాష్ట్ర అధికారులు 75 ఎల్‌ఎంటీ కొనాలని లేఖలు రాశారు. వీరితోపాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, త్రిపుర, అస్సాం రాష్ట్రాల నుంచి బియ్యం ఎక్కువగా కొనాలనే డిమాండ్‌ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరి, గోధుమ సాగువిస్తీర్ణం ఎక్కువవుతోంది. దేశీయ అవసరాలు, వినియోగం, నిల్వలు పోనూ మిగిలినవి ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ఉప్పుడు బియ్యం వినియోగం బాగా తగ్గిపోయింది. తెలంగాణ నుంచి గతేడాది 44.75 ఎల్‌ఎంటీ బాయిల్డ్‌ రైస్‌ కొన్నాం. తాము భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని గోయల్‌కు కేసీఆర్‌ తెలిపారు. పంజాబ్‌ పండించిన వరిలో 90 శాతం కొంటున్నారనే వాదన వినిపిస్తున్నారు. అక్కడ గోధుమ ఎక్కువగా పండిస్తారు. తెలంగాణలో ప్రధాన ఆహారం వరి.. అందుకే కొనుగోళ్లు, సేకరణ విషయంలో పంజాబ్‌తో తెలంగాణను పోల్చడం సరికాదు. యాసంగి(రబీ) పంటకు సంబంధించి ఎంత కొనాలనేది నిర్ణయించలేదు. దేశవ్యాప్తంగా వరి, గోధుమ సాగు విస్తీర్ణం బాగా పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. నిల్వలు ఎక్కువయ్యాయి. పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం పప్పులు, నూనెగింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈక్రమంలో పప్పులు, ఆయిల్‌పాం వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఆయా అంశాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం...

కేంద్ర వ్యవసాయశాఖ ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణలో 2021-22లో 16.90 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. 54.26 ఎల్‌ఎంటీ ధాన్యం పండుతుంది. తెలంగాణలో వరి ప్రధాన ఆహారం కనుక ఆగస్టు 17న నిర్ణయించిన మేరకే మిగులు (40ఎల్‌ఎంటీ బియ్యం) ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం నివేదించిన ప్రకారం వరిసాగు విస్తీర్ణానికి, ఉత్పత్తి అంచనాకు మధ్య తేడాలుండడంతో కేంద్ర వ్యవసాయ శాఖ వివరణ కోరింది.

మహలనోబిస్‌ నేషనల్‌ క్రాప్‌ ఫోర్‌కాస్ట్‌ సెంటర్‌ (ఎంఎన్‌సీఎఫ్‌సీ) నుంచి అందిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ప్రకారం 2021-22 వానాకాలంలో తెలంగాణలో 2.374 మిలియన్‌ హెక్టార్లలో వరి పంట సాగవగా.., 75.43 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తవుతుంది.(హెక్టారుకు 3177 కిలోల చొప్పున)

40 ఎల్‌ఎంటీ నుంచి 90 ఎల్‌ఎంటీకి బియ్యం సేకరణ పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నవంబరు 17న లేఖ రాసింది. కానీ కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం వానాకాలం పంట ఉత్పత్తి 75.43 ఎల్‌ఎంటీ మాత్రమే. వారి విజ్ఞప్తిని పరిశీలిస్తున్నాం.

2020-21 ఖరీఫ్‌ కాలంలో 24.75 ఎల్‌ఎంటీ ఉప్పుడు బియ్యం ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలినవి ముడి బియ్యం రూపంలో ఇస్తామంది.

ఈఏడాది అక్టోబరు 11 నాటికి ఎఫ్‌సీఐ వద్ద 46.28 ఎల్‌ఎంటీ ఉప్పుడు బియ్యం నిల్వలున్నాయి. ఇంకా 32.73 ఎల్‌ఎంటీ సేకరించాల్సి ఉంది. ఈ మొత్తం కలిస్తే 79 ఎల్‌ఎంటీ అవుతుంది. ఏటా 20 ఎల్‌ఎంటీ ఉప్పుడుబియ్యం వినియోగిస్తున్నారు. అలా చూసినా ఎఫ్‌సీఐ వద్ద ఇంకో నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉంటాయి.

తెలంగాణ నుంచి 2020-21 యాసంగిలో 24.75 ఎల్‌ఎంటీ ఉప్పుడుబియ్యం తీసుకోవాలని ఒప్పందం కుదిరినా.. ఆ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అదనంగా 20 ఎల్‌ఎంటీ తీసుకోవడానికి కేంద్రం అంగీకరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని