Passport: సార్‌.. పాస్‌పోర్టు అత్యవసరం.. రోజూ 50 వరకు ఈ తరహా అభ్యర్థనలు

మీ పాస్‌పోర్టు గడువు ఇంకా ఆరు నెలలే ఉందా.. ఆలస్యం చేయకండి.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. కొద్దిరోజుల్లోనే ప్రక్రియ పూర్తయి పాస్‌పోర్టు మీ చేతికొస్తుంది. ఆలస్యం చేస్తే అత్యవసర ..

Updated : 24 Sep 2022 13:23 IST

గడువు తీరింది.. రెన్యువల్‌ చేయండి ప్లీజ్‌
చివరి నిమిషం వరకూ వేచిఉండొద్దని సూచిస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: మీ పాస్‌పోర్టు గడువు ఇంకా ఆరు నెలలే ఉందా.. ఆలస్యం చేయకండి.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. కొద్దిరోజుల్లోనే ప్రక్రియ పూర్తయి పాస్‌పోర్టు మీ చేతికొస్తుంది. ఆలస్యం చేస్తే అత్యవసర సమయంలో ఇబ్బంది పడతారు.. అని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. తొలిసారి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్న వారితో పాటు.. రెన్యువల్‌, రీ ఇష్యూ, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ‘అత్యవసరం’ అంటూ ఎక్కువ మంది పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయానికి (ఆర్పీవో) వస్తున్నారని చెబుతున్నారు. ‘‘పాస్‌పోర్టు గడువు సమీపిస్తున్నవారు.. ముందస్తు రెన్యువల్‌కు అవకాశం ఉన్నా.. విదేశాలకు వెళ్లే సమయంలో గమనించి గడువు ముగిసిందంటూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సైతం కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటున్నారు. జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షల కోసం దరఖాస్తు చేయాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. రెండ్రోజుల్లో ఆ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సి ఉండగా.. పాస్‌పోర్టు కావాలని అడుగుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లేవారికి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఇక్కడ.. లేదంటే విదేశాల్లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం చివరి నిమిషంలో వచ్చి ప్రాధేయపడుతున్నారు. ఇక్కడైతే చౌకగా ప్రక్రియ పూర్తవుతుంది.. విదేశాల్లో డాలర్లలో ఖర్చవుతుంది. సాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి కారణాలతో ప్రతిరోజు దాదాపు 50 మంది అభ్యర్థులు రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వస్తున్నారు. రోజువారీ దరఖాస్తులతో పాటు వీటి ప్రక్రియ చేపడుతుండడంతో తీవ్ర పనిభారం పడుతోంది’’ అని అధికారులు పేర్కొన్నారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ముందస్తుగానే దరఖాస్తు చేసుకుంటే కొద్దిరోజుల్లోనే పాస్‌పోర్టు చేతికొస్తుందని సూచిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సేవా కేంద్రాల్లో రోజుకు 3,500కు పైగా పాస్‌పోర్టులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని