Pharma clusters: ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో ఫార్మా క్లస్టర్లు

హైదరాబాద్‌లో బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 06 Jul 2024 04:41 IST

తెలంగాణలో పరిశ్రమలకు ఏ కష్టం రానివ్వం
మిగులు విద్యుత్తు దిశగా ముందడుగు వేస్తున్నాం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి 

ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఐపీసీఏ అధ్యక్షుడు పార్థసారథిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌/ న్యూస్‌టుడే, మాదాపూర్‌: హైదరాబాద్‌లో బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఔషధ పరిశ్రమకు తెలంగాణ వెన్నెముకగా ఉందని, ఏటా రూ.50,000 కోట్ల విలువైన మందులు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. జనరిక్‌ మందులు, టీకాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఎటువంటి సమస్యలు రానివ్వబోమని, నిరంతరాయంగా విద్యుత్తు, నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నూతన విద్యుత్తు విధానాన్ని ఆవిష్కరిస్తామని, హరిత ఇంధనానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. మిగులు విద్యుత్తు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు.

ఏఐకి పెద్దపీట

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శాస్త్రసాంకేతిక రంగంలో, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ)తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బాహ్య వలయ రహదారి వల్లే, హైదరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఎన్నో ఐటీ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయని గుర్తు చేశారు. ప్రాంతీయ వలయ రహదారి వసే,్త మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను నూతన ఆవిష్కరణల ద్వారా పరిష్కరించాలని, అందుకు ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ దోహద పడుతుందని అన్నారు.  

అమీన్‌పూర్‌లో ఎస్‌డీసీ

 హైదరాబాద్‌ శివార్లలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్యాంపస్‌ను (ఎస్‌డీసీని) పల్స్‌ గ్రూపు ఏర్పాటు చేయనుంది. దీనికి ఎస్‌టీపీఐ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని పల్స్‌ గ్రూప్‌ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఎస్‌డీసీ ద్వారా 10వేల మందికి ప్రత్యక్షంగా, 40వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. 

ప్రదర్శన

ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సావనీర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సదస్సులో భాగంగా, వేర్వేరు ఫార్మాకంపెనీలు ఇక్కడ స్టాల్స్‌ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఫార్మా కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కుమార్‌ పటేల్, సదస్సు ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జె.ఎ.ఎస్‌.గిరి, కార్యదర్శి      రాంకిషన్, ఐపీఏ జాతీయ అధ్యక్షుడు టి.వి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని