Phone tapping case: దొరికినదెంత.. దోచినదెంత?.. ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుల తీరుపై అనుమానాలు

ఎన్నికలప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా పెద్దఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్న రాధాకిషన్‌రావు ముఠా.. అందులో కొంత కాజేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Updated : 13 Jun 2024 07:51 IST

ఎన్నికల సమయంలో పట్టుకున్న సొమ్ములో కొంత పక్కదారి!

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికలప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా పెద్దఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్న రాధాకిషన్‌రావు ముఠా.. అందులో కొంత కాజేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలప్పుడు డబ్బు రవాణాకు సంబంధించి నమోదైన కేసుల చిట్టా బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు రుజువైతే నిందితులపై కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీపైనే తాము ఎక్కువగా దృష్టి సారించామని ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం ప్రణీత్‌రావు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలకు చెందిన వారిపై కన్నేసేవారు. డబ్బు రవాణా చేయబోతున్నారన్న సమాచారం తెలిస్తే దాన్ని వెంటనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా ఆయన సోదాలు నిర్వహించేవారు. ఇదంతా చాలా పకడ్బందీగా జరిగేది. ఒక్కోసారి స్థానిక పోలీసులకూ సమాచారం అందేది. ఏ వాహనంలో డబ్బు తరలిస్తున్నారు.. ఆ వాహనం ఎక్కడుంది వంటి కచ్చితమైన సమాచారాన్ని ప్రణీత్‌రావు ముఠా సేకరించి పోలీసులకు అందించేది. దీని ఆధారంగానే డబ్బు పట్టుకునేవారు. తాము ఎక్కడెక్కడ ఎవరి డబ్బు పట్టుకున్నామో కూడా విచారణ సందర్భంగా నిందితులు వివరించారు. ఇవన్నీ వారి వాంగ్మూలంలో నమోదు చేశారు కూడా. కొన్ని సందర్భాల్లో దొరికిన డబ్బులో కొంత కాజేసి.. మిగతాదే లెక్కల్లో చూపించారని అనుమానిస్తున్నారు. చట్టవిరుద్ధంగా రవాణా చేస్తున్న డబ్బు కావడంతో దాన్ని తీసుకెళుతున్న వారు కూడా నిజం చెప్పేవారు కాదని, పోలీసు లెక్కల్లో ఎంత రాస్తే అంతే పట్టుబడ్డట్లు సంతకాలు కూడా పెట్టేవారని తెలుస్తోంది. దీనిపైనే ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. డబ్బు రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిని పిలిపించి, విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం.

నిందితులకు బెయిల్‌ నిరాకరణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభ్యంతరం తెలపడంతో న్యాయస్థానం వారి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ గత మే 28న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలు సమర్పించలేదని పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినా ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని