Phone Tapping case: నగదు తరలింపు వెనుక ఓ ఐపీఎస్‌!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 14 Jun 2024 08:52 IST

మునుగోడు ఉప ఎన్నికలో భారాసకు సహకారం
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్రమంలో బహిర్గతం
‘సిట్‌’కు తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్ల వాంగ్మూలం

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్‌తోపాటు డీఎస్పీ పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైనా.. తెరవెనుక మాత్రం మరికొందరు అత్యున్నతస్థాయి పోలీసు అధికారులున్నట్లు తెలుస్తోంది. వారి మౌఖిక ఆదేశాలకు తలొగ్గిన క్రమంలోనే ఆ ఐపీఎస్‌ నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్లు సమాచారం. అయితే ఇంతవరకు సిట్‌ దర్యాప్తు మాత్రం ఐపీఎస్‌ అధికారి ప్రమేయంపై ఆధారాల సేకరణ వరకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరింత ముందుకెళ్తే అత్యున్నతస్థాయి అధికారుల పాత్ర నిగ్గు తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు సిట్‌కు లభ్యమైన ఆధారాల మేరకు.. 2022 నవంబరు 3న జరిగిన ఉప ఎన్నికలో భారాస (అప్పటి తెరాస) అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు ఫార్చునర్‌ వాహనం వినియోగించారు. వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్‌ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఆ ఐపీఎస్‌ అధికారితోపాటు స్పెషల్‌ బ్రాంచ్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన డీఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించినట్లు కానిస్టేబుల్‌ సిట్‌ ఎదుట వాంగ్మూలమిచ్చారు. నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్‌ అప్పటి తతంగాన్ని సిట్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

7 రోజుల పాటు డబ్బు తరలింపు!

సిట్‌ తాజా దర్యాప్తులో తేలిన అంశాల మేరకు.. ‘‘మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నేను నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశా. ఐపీఎస్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ నన్ను తన వెంట తీసుకెళ్లారు. 2022 అక్టోబరు 26 నుంచి నవంబరు 2 వరకు (నవంబరు 1న తప్ప) వరుసగా రాత్రి వేళల్లో ఫార్చునర్‌ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించా. అదే వాహనంలో తెరాస అభ్యర్థికి సంబంధించిన డబ్బు తరలించారు. అక్టోబరు 31న బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మా డీఎస్పీ ఓ పోలీసు అధికారిని నాకు చూపించారు. అతను అదనపు ఎస్పీ అని.. కేసీఆర్‌తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. అతని ఆదేశాల మేరకు మనం ఈ డబ్బు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. తర్వాత ఆ పోలీసు అధికారి నాయిని భుజంగరావు (ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు) అని నాకు తెలిసింది’’ అని కానిస్టేబుల్‌ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని