Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరుగురు నిందితులు.. 69 మంది సాక్షులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Updated : 12 Jun 2024 07:33 IST

నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఛార్జిషీట్‌లో.. ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడు అరువుల శ్రవణ్‌రావులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌కుమార్‌లు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 69 మంది సాక్షుల వాంగ్మూలాలను ఛార్జిషీటులో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లలో పనిచేసిన పోలీసు అధికారులతోపాటు పలువురు ప్రైవేటు వ్యక్తులున్నారు. మొత్తం 68 పేజీలతో కూడిన ఛార్జిషీటుకు అనుబంధంగా.. ఆరోపణలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలున్నందున మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న కీలక నిందితులిద్దరినీ విచారించాక మరిన్ని ఆధారాలతో ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సరిగ్గా మూడు నెలలకు..

తొలుత ఎస్‌ఐబీలో ఆధారాలు ధ్వంసమయ్యాయంటూ ఆ విభాగం అదనపు ఎస్పీ రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 10న పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ ఆ మరుసటి రోజు అదే విభాగంలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావును సస్పెండ్‌ చేశారు. అదే నెల 13న అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో సంచలన అంశాలు వెలుగుచూశాయి. కేసు ప్రాధాన్యం దృష్ట్యా హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయడంతోపాటు దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరిని నియమించారు. దర్యాప్తు క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం వెలుగుచూసింది. మిగిలిన నిందితుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో అరెస్టు చేశారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో 4 నెలలపాటు సుమారు 1200 ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు. భారాసను గెలిపించడమే లక్ష్యంగా ప్రభాకర్‌రావు నేతృత్వంలోని నిందితుల బృందం ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలోనే రాజకీయనేతలు, జర్నలిస్టులతోపాటు జడ్జీల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు. ఇలా దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా సరిగ్గా 3 నెలలకు ప్రాథమిక ఛార్జిషీటు దాఖలు చేశారు.

బెయిల్‌ కోసం నిందితుల పిటిషన్‌

నిందితులు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే పోలీసులు అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలు సమర్పించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ.. ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెలువరించనున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని