Phone Tapping Case: సిట్‌ చేతికి సాంకేతిక ఆధారాలు!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

Published : 17 Jun 2024 05:52 IST

కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ నుంచి యాక్సెస్‌లాగ్స్‌.. సెర్చ్‌లాగ్స్‌ వివరాల సేకరణ
ఫోన్‌ ట్యాపింగ్‌పై డీవోటీ నుంచి సైతం కీలక సమాచారం?

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌కార్యాలయంలో తనిఖీలు చేసిన సిట్‌.. 3 సర్వర్లు, హార్డ్‌డిస్క్‌లతోపాటు 5 మాక్‌ మినీ డివైజ్‌లను జప్తు చేసింది.  ఎస్‌ఐబీలో ఫోన్‌ట్యాపింగ్‌ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థే సమకూర్చింది. దీంతో ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన యాక్సెస్‌ లాగ్స్, సెర్చ్‌ లాగ్స్‌ కోసం సంస్థ డైరెక్టర్‌ బూసి పాల్‌రవికుమార్‌కు నోటీసులు ఇచ్చిన సిట్‌.. ఆయన నుంచి సమాచారం సేకరించింది. ఈక్రమంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఆయనతో మేజిస్ట్రేట్‌ ముందు 160 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇప్పించింది. ఆ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ రాగి అనంతచారి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఓలేటి సీతారామశ్రీనివాస్‌ల నుంచి సైతం వాంగ్మూలాలు సేకరించింది. ల్యాబ్స్‌లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. 

టెలికాం కంపెనీలకు నోటీసులు

సాధారణంగా సంఘవిద్రోహ శక్తులు, కరడుగట్టిన నేరస్థుల ఫోన్లను ట్యాప్‌ చేసేందుకు మాత్రమే టెలికాం కంపెనీలు అనుమతి ఇస్తుంటాయి. అందుకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం తప్పనిసరి. అయితే ప్రభాకర్‌రావు బృందం చట్టవిరుద్ధంగా భారాస రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు గుర్తించిన సిట్‌.. దీనిపై సాంకేతిక ఆధారాల సేకరణకు టెలికాం కంపెనీల నోడల్‌ అధికారులకు 91 సీఆర్పీసీ నోటీసులు జారీచేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ (డీవోటీ)కి సైతం నోటీసులు ఇచ్చింది. వారి నుంచి కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. 

పోలీసుల వాంగ్మూలాలతో.. 

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి నాటికి సుమారు 1200 సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించింది. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, కీలక నిందితుడు ప్రణీత్‌రావు ఆదేశాలతో తాను 60-70 మంది ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు దర్యాప్తు బృందానికి ఓ సీఐ ఇప్పటికే వాంగ్మూలమిచ్చారు. అందులో సిద్దిపేటలో భారాసకు వ్యతిరేకంగా పనిచేసిన చక్రధర్‌గౌడ్‌తోపాటు విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ దాసరి భూమయ్య తదితరుల సెల్‌ఫోన్‌ సంభాషణలను విన్నట్లు వెల్లడించారు. అలానే ఎస్‌ఐబీతోపాటు టాస్క్‌ఫోర్స్‌ల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బంది పలువురు ప్రభాకర్‌రావు బృందం నిర్వాకాలపై వాంగ్మూలాలు ఇస్తుండటంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని