Piyush Goyal: తెలంగాణ సర్కారుది అసత్య ప్రచారం

ముడిబియ్యం ఎంతైనా కొనుగోలుచేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ

Updated : 27 Feb 2024 14:08 IST

కేంద్రమంత్రి గోయల్‌ ధ్వజం
వైఫల్యాలు, వరుస ఓటములతోనే ఆరోపణలు
27 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు

ఈనాడు, దిల్లీ: ముడిబియ్యం ఎంతైనా కొనుగోలుచేస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ఆరోపించారు. ‘‘వరుస ఓటములతో అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అందువల్లే ప్రజలు, రైతులను ఇబ్బందులుపెట్టే పనిచేస్తోంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అబద్ధపు ప్రచారాలు చేస్తోంది. వాటిని నమ్మొద్దు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు, రైతులకు అండగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. బియ్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకోవడానికి రాష్ట్ర మంత్రులు దిల్లీలో మకాం వేసిన నేపథ్యంలో పీయూష్‌గోయల్‌ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, డీకే అరుణ, విజయశాంతిలతో కలిసి తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇదివరకు ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యాంశాలు...

తెలంగాణకు అండగా ప్రధాని మోదీ
‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటారు. పార్టీ నేతలంతా రాష్ట్ర విషయాలను కేంద్రం దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం నుంచి మద్దతు తీసుకుంటున్నారు. దానివల్ల గత అయిదేళ్లలో తెలంగాణ నుంచి వడ్ల సేకరణ మూడు రెట్లు, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 రెట్లు పెరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కలు ఆశ్చర్యకరం
కొన్ని లెక్కలు చెబితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజలను ఏ స్థాయిలో తప్పుదోవపట్టిస్తుందో అర్థమవుతోంది. రబీ సీజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యంలో ఇప్పటివరకూ 27 లక్షల టన్నులు ఇవ్వలేదు. తెలంగాణను ప్రత్యేక కేసుగా పరిగణించి 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం అదనంగా తీసుకోవడానికి అంగీకరించాం. వాస్తవానికి ఉప్పుడు బియ్యాన్ని తెలంగాణ ప్రజలే తినరు. దానికి దేశంలో డిమాండ్‌ లేకపోయినా రాష్ట్ర రైతుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవడానికి అంగీకరించాం. అయినప్పటికీ ఈరోజువరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి 14 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం, 13 లక్షల టన్నుల సాధారణ బియ్యం ఇవ్వలేదు. ఇప్పటికే నాలుగుసార్లు తేదీ పొడిగించాం. త్వరగా ఇవ్వమని పదేపదే చెబుతున్నా వారు వినిపించుకోవడంలేదు. ఇప్పటికైనా ఆ బియ్యం త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం. మున్ముందు ముడి బియ్యం మాత్రమే ఇవ్వాలని ఏడాది క్రితమే చెప్పాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత బియ్యమైనా ఉంచుకోవచ్చు. అంతకుమించి అదనంగా ఉన్న బియ్యాన్ని దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీ నుంచి కొనుగోలుచేస్తామని హామీ ఇచ్చాం. డిమాండ్‌ ఉన్న బియ్యాన్నే ఇవ్వాలని ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాలేదు
ఎఫ్‌సీఐలో గోదాములు ఖాళీగా లేవన్న ప్రచారం అబద్ధం. 27 లక్షల టన్నుల కోటా బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ నుంచి మాకు ఒక్క లేఖకూడా రాలేదు. కేంద్రం రైలు రేక్‌లు ఇవ్వలేదని చెప్పడంకూడా అసత్యం. ఎన్ని రేక్‌లు కావాలన్నా సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేం ఎలా తరలిస్తామన్నదానితో వారికి సంబంధం లేదు. వారు ఇవ్వాల్సిన సరకు ఇస్తేచాలు. 27 లక్షల టన్నుల సరకు రబీదే అయి ఉండాలి. అదికూడా తెలంగాణది అయి ఉండాలి. బయటినుంచి తెచ్చి మాకు ఇవ్వడం కుదరదు. పౌరసరఫరాల మంత్రిగా గతంలో పనిచేసిన ఈటల రాజేందర్‌కు అక్కడి విషయాలు బాగా తెలుసు.

కేంద్రం నేరుగా కొనుగోలుచేయదు
తెలంగాణ డీసెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (డీసీపీ) రాష్ట్రం కాబట్టి కేంద్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలుచేయదు. రాష్ట్ర ప్రభుత్వమే  రైతుల నుంచి వడ్లు కొనుగోలుచేసి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. ఎంఓయూలోని క్లాజ్‌ 18 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని అక్టోబరు 4న లేఖ ఇచ్చింది. ఈటల రాజేందర్‌ విజయం తర్వాత తెరాస నాయకులు అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు’’ అని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ పేర్కొన్నారు.


ముడిబియ్యం ఎంతైనా కొనడానికి సిద్ధం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వెన్నంటి ఉందని నేను రాజ్యసభ, లోక్‌సభల్లో చెప్పాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సరఫరా చేస్తామని చెప్పిన మొత్తాన్నే ఇవ్వలేకపోతోంది. వచ్చే సంవత్సరానికి ఎంత ముడి బియ్యం ఇచ్చినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ అబద్ధాలు చెబుతోంది. ముఖ్యమంత్రి, నేతలు నాపై, కిషన్‌రెడ్డిపై ప్రయోగించిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా పేర్లతో వారు అబద్ధాలు చెబుతున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలి

-పీయూష్‌గోయల్‌


మేం బిజీ... వారికి పని లేదేమో..!

తెలంగాణ మంత్రులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పడం అబద్ధం. శనివారం దిల్లీకొచ్చి కూర్చొని అలా ప్రచారం చేయడం తగదు. నేనేమీ వారిని ఆహ్వానించలేదు. నేను శని, ఆదివారాల్లో ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఉన్నాను. మేమంతా మాపనుల్లో బిజీగా ఉన్నాం. వారెలా అంత ఖాళీగా ఉన్నారో తెలియడంలేదు. వారికి చేయడానికి ఏం పనిలేదా? ప్రజలకు సేవచేసే ఉద్దేశం వారిలో కనిపించడం లేదు.  

-పీయూష్‌గోయల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని