PM Modi: అమ్మభాష స్వాభిమాన సంకేతం

మన జీవితాన్ని అమ్మ ఎలా తీర్చిదిద్దుతుందో మాతృభాష కూడా అలాగే ఓ రూపునిస్తుంది. మాతృమూర్తి, మాతృభాష రెండూ కలిసి మన జీవిత పునాదులను బలోపేతం చేసి చిరంజీవులను చేస్తాయి. అమ్మను ఎలా వదిలిపెట్టలేమో.. మాతృభాషనూ అలాగే కాపాడుకోవాలి.

Updated : 28 Feb 2022 05:03 IST

మాతృభాష గురించి చెప్పుకోడానికి సంకోచమేల!
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

మన జీవితాన్ని అమ్మ ఎలా తీర్చిదిద్దుతుందో మాతృభాష కూడా అలాగే ఓ రూపునిస్తుంది. మాతృమూర్తి, మాతృభాష రెండూ కలిసి మన జీవిత పునాదులను బలోపేతం చేసి చిరంజీవులను చేస్తాయి. అమ్మను ఎలా వదిలిపెట్టలేమో.. మాతృభాషనూ అలాగే కాపాడుకోవాలి.

- మోదీ

ఈనాడు, దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో ఇప్పటికీ కొందరు సొంత భాష, వస్త్రధారణ, అన్నపానీయాల గురించి చెప్పుకోడానికి సంకోచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్వాభిమానానికి సంబంధించిన అంశమని అన్నారు. ఆదివారం ఉదయం ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రధాని మాట్లాడుతూ మాతృభాష ప్రాధాన్యం వివరించారు. యువత విభిన్న భాషల్లోని ప్రఖ్యాత గీతాలతో వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. ‘‘భారత్‌లో అత్యంత పురాతన భాష తమిళం. ప్రపంచంలో ఇంత ఘనమైన వారసత్వం మనకు ఉన్నందుకు గర్వించాలి. పురాతన ధర్మశాస్త్రాల గురించి మన సంస్కృత భాషలోనే అభివ్యక్తీకరించారు. 2019లో ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ మూడోస్థానంలో నిలిచింది. దీన్ని ప్రతి భారతీయుడూ గర్వంగా భావించాలి. భాషంటే అభివ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు, అది సమాజ సంస్కృతి, వారసత్వాల సంరక్షణకు దోహదం చేస్తుంది. జాతీయ విద్యావిధానంలోనూ స్థానిక భాషలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రధాని తెలిపారు. 

శభాష్‌ విశాఖపట్నం

ప్రధాని మోదీ తన ప్రసంగంలో విశాఖపట్నంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద జరుగుతున్న పనుల గురించి కూడా వివరించారు. అక్కడ పాలిథిన్‌కు బదులు నూలుసంచులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పర్యావరణ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా విశాఖవాసులు ప్రచారం కూడా మొదలుపెట్టారని అభినందించారు.


అమెరికాలో తెలుగువెలుగు

‘‘నాకు కొన్నేళ్ల కిందటి ఓ సంఘటన గుర్తుకువస్తోంది. అమెరికా వెళ్లినప్పుడు విభిన్న కుటుంబాలను కలిసే అవకాశం దక్కేది. అందులో భాగంగా ఒకసారి ఓ తెలుగు కుటుంబం ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ  ఒక సంతోషకరమైన దృశ్యం కనిపించింది. కుటుంబసభ్యులంతా స్థానికంగా ఉన్నపుడు ఎంత పనున్నా అందరూ కలిసి ఒకేచోట కూర్చొని రాత్రిభోజనం చేయాలని, ఆ సమయంలో అందరూ కచ్చితంగా తెలుగే మాట్లాడాలని వారి నియమం. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడటం చూసి నేనెంతో ప్రభావితమయ్యా.’’


భారత్‌లో 121 మాతృభాషలు

‘‘భాషల విషయంలో భారత్‌కున్న సుసంపన్నతను కొలవడం అసాధ్యం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి.. కచ్‌ నుంచి కోహిమా వరకు వందల భాషలు, వేల యాసలున్నాయి. ఒకదానికొకటి భిన్నమైనా అన్నీ మమేకమై మనుగడ సాగిస్తున్నాయి. భాషలు ఎన్నున్నా భావం ఒక్కటే. భారతీయులు దాదాపు 121 మాతృభాషలతో మమేకమై ఉన్నారు. యూరోపియన్‌ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువమంది మన దేశంలోని 14 భాషలతో అనుసంధానమై ఉన్నారు.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని