Miyapur: సర్కారు భూముల్లో గుడిసెలు వేసే యత్నం

రాజధాని శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు శనివారం దాదాపు 2 వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు.

Published : 23 Jun 2024 03:54 IST

2 వేల మంది రాక.. మియాపూర్‌లో ఉద్రిక్తత

గుడిసెలు వేసేందుకు యత్నించిన వారితో మాట్లాడుతున్న మియాపూర్‌ ఏసీపీ నరసింహారావు, హెచ్‌ఎండీఏ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, మియాపూర్‌: రాజధాని శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు శనివారం దాదాపు 2 వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఇటీవల 50 మంది ఈ భూముల్లో గుడిసెలు వేసే ప్రయత్నం చేయడంతో అధికారులు అడ్డుకున్నారు. రెండు రోజులుగా వీరంతా శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగి ప్రభుత్వ భూముల్లో తమకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి మియాపూర్, పటాన్‌చెరు ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది జతకలిశారు. దాదాపు 2వేల మంది వరకు శనివారం మియాపూర్‌ భూముల్లోకి చొచ్చుకొచ్చి గుడిసెలు వేయబోయారు. సమాచారం అందుకున్న హెచ్‌ఎండీఏ ఎస్టేట్‌ అధికారి వీరారెడ్డి, మాదాపూర్‌ డీసీపీ వినీత్, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వెంకారెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. భూముల కేసు సుప్రీంకోర్టులో ఉందని, వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అదనపు బలగాలు రప్పించి వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీఛార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. పొద్దుపోయినా ఆందోళనకారులు తిష్ఠ వేయడంతో వారిని పంపేందుకు పోలీసులు, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 

ఆక్రమణదారుల కన్ను: దేశ విభజన సందర్భంగా ఇక్కడి నుంచి పాకిస్థాన్‌కు తరలిపోయిన వ్యక్తులకు చెందిన(అవెక్యూ) భూముల కింద ఈ 525 ఎకరాలను పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తాము గతంలో కొనుగోలు చేశామని 32 మంది కోర్టు కెళ్లారు. కింది కోర్టుల నుంచి హైకోర్టు వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ భూమి గజం లక్ష వరకు పలుకుతుండటంతో చాలామంది రాజకీయ నేతలు, ఆక్రమణదారుల కళ్లు వీటిపై పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఇందులో 50 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని