Telangana News: 1 నుంచి కరెంటు షాక్‌

రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇళ్లలో ప్రజలు వాడే కరెంటుకు ప్రస్తుత ఛార్జీలపై అదనంగా యూనిట్‌కు విభాగాల వారీగా 40 నుంచి 50 పైసలు...పరిశ్రమలు, ఇతర వర్గాలవారికి రూపాయి చొప్పున పెంచడానికి ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతించింది

Updated : 24 Mar 2022 14:02 IST

గృహ వినియోగదారులకు యూనిట్‌కు 40-50 పైసల పెంపు
ఇతర వర్గాలకు యూనిట్‌కు రూపాయి అదనం
50 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.1.95
300 దాటితే యూనిట్‌కు రూ.9
ప్రజలపై రూ.5596 కోట్ల భారం
పెంపును ఆమోదించిన ఈఆర్‌సీ
ఈనాడు - హైదరాబాద్‌


క్షౌరశాలలకు, కుటీర పరిశ్రమలకు, విద్యుత్‌ వాహనాలకు పెంపు లేదు. ఈ వర్గాలకు పాత ఛార్జీలే కొనసాగుతాయి. వ్యవసాయానికి ఉచితంగా ఇస్తారు.


యూనిట్‌కు వేసే ఛార్జీతో పాటు స్థిర డిమాండు ఛార్జీని అదనంగా ఇళ్ల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది కాకుండా కరెంటు వాడుకుంటున్నందున ప్రభుత్వానికి ప్రజలు చెల్లించే ఇంధన రుసుమును సైతం ప్రతీ విభాగానికి పెంచారు


ప్రస్తుత ఛార్జీలకన్నా 18 శాతం అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలివ్వగా 14 శాతం పెంచడానికి ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది


రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇళ్లలో ప్రజలు వాడే కరెంటుకు ప్రస్తుత ఛార్జీలపై అదనంగా యూనిట్‌కు విభాగాల వారీగా 40 నుంచి 50 పైసలు...పరిశ్రమలు, ఇతర వర్గాలవారికి రూపాయి చొప్పున పెంచడానికి ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతించింది.  దీంతో వినియోగదారులపై అదనంగా రూ.5596 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఛార్జీల పెంపు వివరాలను మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు బుధవారం తమ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.  ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 101 యూనిట్ల వరకూ, వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, ఇతర వర్గాలకు తక్కువకు కరెంటు సరఫరా చేస్తున్నందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8,221.17 కోట్లను రాయితీగా డిస్కంలకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని శ్రీరంగారావు చెప్పారు. ఈ రాయితీపోగా ఛార్జీల పెంపుతో వచ్చే ఏడాది మరో రూ.5,596.98 కోట్లు అదనంగా వస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.16,866.53 కోట్లు ఉంటుందని, దానిని పూడ్చుకోవడానికి ఛార్జీలు పెంచాలని డిస్కంలు గత డిసెంబరులో ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్‌ఆర్‌) నివేదికను మండలికి ఇచ్చాయన్నారు.లోటు రూ.14,237.40 కోట్లు ఉంటుందని నిర్ధారించి ఛార్జీల పెంపునకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపిందని వివరించారు.  

ఆయన చెప్పిన ముఖ్యాంశాలు...
* వినియోగదారులపై భారం వేయాలనే ఆలోచన లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల మెరుగుదల కోసం డిస్కంలు రూ.35 వేల కోట్లను ఖర్చుపెట్టాయి. కరెంటు కొనుగోలు వ్యయం బాగా పెరిగినందున వారిపై కొంత భారం వేయకతప్పదు. అందుకే కరెంటు ఛార్జీల పెంపునకు అనుమతించాం. 2016-17 తరవాత ఐదేళ్లకు 2022-23లో తిరిగి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి.
*  వ్యవసాయానికి రూ.6850 కోట్లు, ఇతర వర్గాలకు రూ.1466 కోట్లను రాయితీగా ప్రభుత్వం వచ్చే ఏడాది ఇవ్వనుంది. ఇది ప్రస్తుత ఏడాదికన్నా 38.39 శాతం అధికం.
* రాష్ట్రంలో ఒక యూనిట్‌ సరఫరాకు సగటు వ్యయం (ఏసీఎస్‌) 2018-19లో రూ.6.04 కాగా 2022-23లో రూ.7.03 ఉంటుంది.
* అతి తక్కువగా 50 యూనిట్లలోపు వాడేవారికి యూనిట్‌కు రూ.1.95 చొప్పున, 300 యూనిట్లు దాటితే రూ.9 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు.
*  మేకలు, గొర్రెల పెంపకందారులు, పాడి పరిశ్రమకు వాడే మోటార్ల అశ్వికశక్తి (హెచ్‌పీ) లోడును 10 నుంచి 15 హెచ్‌పీకి పెంచారు.
*  పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల వారు సంప్రదాయేతర ఇంధన కొనుగోలుకు ‘హరిత ఛార్జీ’ (గ్రీన్‌ టారీఫ్‌)’ యూనిట్‌కు రూ.2 చొప్పున వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా 66 పైసలకే మండలి అనుమతించింది.
*  సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి కేంద్రాలు పెట్టుకునేవారికి గ్రిడ్‌ సపోర్ట్‌ ఛార్జీలు వేయాలనే ప్రతిపాదనను మండలి పక్కనపెట్టింది.

నివేదికలివ్వకుంటే జరిమానా
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కరెంటు ఛార్జీలు సవరించాలంటే అంతకుముందు నవంబరు 30కల్లా సవరణ ప్రతిపాదనలు డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వాలని విద్యుత్‌ చట్టం చెబుతోంది. కానీ తెలంగాణ డిస్కంలు ఈ నిబంధనలను మూడేళ్లుగా పట్టించుకోలేదు. వచ్చే నవంబరు 30కల్లా ఏఆర్‌ఆర్‌ నివేదిక ఇవ్వకపోతే డిస్కంలకు జరిమానా వేయాలని ఈఆర్‌సీ నిర్ణయించింది.
*  వ్యవసాయానికి ఎంత కరెంటు సరఫరా చేస్తున్నారనే లెక్కలు తేల్చడానికి ప్రతి వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద తప్పనిసరిగా మీటర్లను రెండేళ్లలోగా రాష్ట్రమంతా ఏర్పాటుచేయాలి.
* ఏదైనా ఒక జిల్లాలో వ్యవసాయానికి వాస్తవంగా ఎంత కరెంటు సరఫరా అవుతుందో తేల్చడానికి ఇంధన ఆడిట్‌ నిర్వహించాలని ఈఆర్‌సీ యోచిస్తోంది.
*విద్యుత్‌ సరఫరా, పంపిణీ, వాణిజ్య (ఏటీసీ) నష్టాలు కొన్ని ప్రాంతాల్లో 44 శాతం వరకూ ఉన్నాయి. ఈ శాతాన్ని 15 లోపునకు డిస్కంలు తగ్గించాలి. అంతకన్నా ఎక్కువ నష్టాలుంటే వాటిని వచ్చే ఏడాది ఛార్జీల సవరణ నివేదికల్లో మండలి పరిగణలోకి తీసుకోదు.
*  ఆసక్తితో ముందుకొచ్చే వారి ఇళ్లలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను డిస్కంలు ఏర్పాటుచేయాలి. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను డిస్కంలు మండలికి అందజేయాలి.
  విద్యుత్‌ కొనుగోలు వ్యయం తగ్గింపు

* విద్యుత్‌ కొనుగోలు వ్యయం భారీగా పెరిగిందని వచ్చే ఏడాదికి రూ.39,415.08 కోట్లు వెచ్చించి కొనాల్సి ఉంటుందని డిస్కంలు ఈఆర్‌సీకి తెలిపాయి. కానీ ఈ వ్యయం రూ.35,134.74 కోట్లు మాత్రమే ఉంటుందని మండలి తేల్చింది.





 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని