Corona: కాబోయే అమ్మను కాపాడుకుందాం

హైదరాబాద్‌ మల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల అయిదు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోక చివరికి అంబులెన్సులో తుదిశ్వాస

Updated : 17 May 2021 15:26 IST

ఆయాసం, అలసట, నీరసం.. ఏ లక్షణమున్నా నిర్లక్ష్యం చేయొద్దు
రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం
అత్యవసర పరిస్థితుల్లో హైరిస్క్‌ ఆసుపత్రికి వెళ్లాలి
ముందుజాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదంటున్న వైద్యులు

హైదరాబాద్‌ మల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి ఇటీవల అయిదు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోక చివరికి అంబులెన్సులో తుదిశ్వాస విడిచిన ఘటన ప్రతి ఒక్కర్ని కలచివేసింది. కుటుంబాలకు కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపడం లేదు. కొవిడ్‌ అనుమానంతో ప్రసూతి ఆసుపత్రులు సత్వర వైద్యం అందించక పోవడంతో గర్భిణుల ప్రాణాలకు ముప్పువస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయాసం, అలసట సమస్యలు గర్భిణుల్లో సాధారణమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకినా ముందుజాగ్రత్తలు పాటించాలని, సత్వర చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో   ఏం చేయాలనే అంశాలపై వైద్య నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌ చర్లపల్లిలో ఉంటున్న ఓ గర్భిణికి ఇటీవల పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేర్చుకోకపోవడంతో దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌.. ఇలా పలు ప్రైవేటు ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోవడంతో చివరికి ‘గాంధీ’కి తరలించారు. అప్పటికే ఆమె తీవ్ర ఆయాసంతో బాధపడుతోంది. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు రెండు రోజుల క్రితమే కడుపులో శిశువు చనిపోయినట్లు తేల్చారు. తల్లికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె కూడా తనువు చాలించింది.


తాజాగా మల్లాపూర్‌కు చెందిన ఓ గర్భిణికి ఆయాసంతోపాటు ఒంట్లో నలతగా ఉండటంతో స్థానిక ఆసుపత్రిలో చూపించారు. ఇలాంటి సమస్యలు సాధారణమేనంటూ ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించివేశారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్‌లోని అయిదు ఆసుపత్రులకు వెళ్లినా రకరకాల కారణాలతో ఎవరూ చేర్చుకోలేదు. చివరికి ఆమె అంబులెన్సులోనే కన్నుమూసింది.


నగరానికి చెందిన ఓ గర్భిణికి నెలలు నిండాయి. ఇటీవల ఆయాసం, అలసట సమస్యలు ఉత్పన్నం కావడంతో సాధారణమే అనుకున్నారు. గంటలు గడిచేకొద్దీ తీవ్రం కావడంతో అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అదే అంబులెన్సులో ‘గాంధీ’కి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్చుకున్న వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. ఆక్సిజన్‌ శాతం 85కు పడిపోయినట్లు గుర్తించి వెంటనే ప్రాణవాయువు అందించారు. రెండు రోజుల తర్వాత ఆక్సిజన్‌ స్థాయులు సాధారణ స్థితికి రావడంతో ప్రసవం చేశారు. కొన్ని రోజుల తర్వాత తల్లీబిడ్డ కోలుకోవడంతో ఇంటికి పంపించారు.

కాలం మారింది. కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపటం లేదు. గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి విడతలో దాదాపు వెయ్యి మంది గర్భిణులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెండో విడతలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 45 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ 200 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ వస్తున్నారు. తొలుత స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు ‘గాంధీ’కి తరలిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆఖరి నిమిషంలో వస్తుండటంతో కొందరి పరిస్థితి విషమిస్తోంది. కరోనా సోకినా ముందుజాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఆయాసం.. అలసట ఉందా?

గర్భిణుల్లో ఆరో నెల తర్వాత కొంత ఆయాసం, అలసట సాధారణమే. మామూలు స్థితిలో గట్టిగా ఊపిరి తీసుకొని వదిలినప్పుడు పొట్ట, ఛాతీ మధ్యలో ఉన్న భాగం(డయాఫ్రమ్‌) కిందకి, పైకి కదులుతుంది. గర్భిణుల్లో నెలలు నిండేకొద్దీ కడుపులో ఉన్న శిశువు పెరిగి గర్భసంచి విస్తరిస్తుంది. పొట్ట, ఛాతీ మధ్య కదలిక కష్టమై ఆయాసం, అలసట వస్తుంటాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గర్భిణుల్లో కన్పించే ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా పాజిటివ్‌ రోగుల్లో రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గడం, మరికొందరిలో గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల ఆయాసం వస్తుంది. కొందరు గర్భిణులను తొలి నుంచే రక్తహీనత సమస్య వేధిస్తుంటుంది. ఇది కూడా ఆయాసం, అలసట, నీరసానికి కారణమే. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యులను సంపదించాలని సూచిస్తున్నారు.

ప్రతి నెలా కీలకమే..
- డాక్టర్‌ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆసుపత్రి

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రతి నెలా కీలకమే. కరోనా కోరలు చాస్తున్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఏదైనా మార్పు లేదా లక్షణాలు కన్పిస్తే వైద్యులకు చెప్పాలి
తొలి మూడు నెలలు ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకోవాలి. టీటీ ఇంజక్షన్‌ తీసుకోవాలి. నాలుగో నెల నుంచి ఫోలిక్‌ యాసిడ్‌తోపాటు ఐరన్‌ కూడా తప్పనిసరి. డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు వీటిని తీసుకోవాలి.
ఆహారంలో నిత్యం గుడ్డు, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, చికెన్‌, చేపలు ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షల పేరుతో ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందే. ముందే వైద్యులతో మాట్లాడి విజిట్‌లను కుదించుకోవాలి. 2-3 వారాలకు ఒకసారి, మూడో నెలలో మరోసారి, 4-5 నెలల్లో, తర్వాత 8 నెలలో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
జ్వరం, దగ్గు, ఆయాసం, చేతులు, కాళ్ల వాపు, గుండె దడ, కడుపులో శిశువు కదలిక లేకపోవడం లాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇంట్లోనే డిజిటల్‌ థర్మామీటర్‌, బీపీ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ అందుబాటులో పెట్టుకోవాలి. కరోనా సోకి వైద్యుల సూచనలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు జ్వరం, బీపీ, పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయులు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆక్సిజన్‌ 95, 93, 94 శాతాలకు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
  

ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
- డాక్టర్‌ సవితాదేవి, ప్రముఖ గైనకాలజిస్టు

కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో ఇంట్లో గర్భిణులు ఉంటే ముందే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆఖరి నిమిషంలో హడావుడి వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు చికిత్స తీసుకుంటున్న వైద్యునితో దీనిపై చర్చించాలి.
అత్యవసరమైతే ఎక్కడ చేరాలి? కొవిడ్‌ సోకితే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్ని ప్రసూతి ఆసుపత్రులు కొవిడ్‌ సోకిన గర్భిణులకు చికిత్స అందించడం లేవు. హైరిస్క్‌ సేవలు అందించే కేంద్రాల్లోనే ఈ సేవలున్నాయి. ఎక్కడెక్కడ ఈ హైరిస్క్‌ ఆసుపత్రులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ కొవిడ్‌ సోకితే తక్షణమే వాటిని సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి ఆసుపత్రిలో ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. అవసరమైతే ఆ కేంద్రాలను సంప్రదించవచ్చు.
చాలామంది గర్భిణులకు స్వల్ప లక్షణాలుంటే హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తగ్గిపోతోంది. కొందరి పరిస్థితి విషమిస్తోంది. ఇలాంటివారు ఎలాంటి ఆలస్యం లేకుండా హైరిస్క్‌ ఆసుపత్రులను సంప్రదించాలి. వెంటనే చికిత్స అందించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో జ్వరం 100 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా.. తీవ్ర ఆయాసం.. ఆక్సిజన్‌ 93 శాతం కంటే తగ్గినా.. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరాలి. సీఆర్‌పీ, డీ డైమర్‌, సీబీపీ, ఈఎస్‌ఆర్‌ లాంటి పరీక్షలూ చేయాల్సి ఉంటుంది.
గర్భిణులు కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇతరులకు దూరంగా ఉండటం, చేతుల శుభ్రత, మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఫంక్షన్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం లాంటివి పూర్తిగా తగ్గించుకోవాలి. ఇంట్లోనూ ప్రత్యేక గదిలో ఉండటం శ్రేయస్కరం. మిగతా కుటుంబ సభ్యులతో దూరం నుంచే మాట్లాడాలి. వాడే వస్తువులన్నీ ప్రత్యేకంగా పెట్టుకోవాలి.
సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ముఖ్యంగా ఛాతీ స్కానింగ్‌ లాంటివి నిపుణులైన వైద్యుల సమక్షంలో చేస్తారు. వైరల్‌ మందులను వైద్యుల సూచనలతోనే తీసుకోవాలి. జ్వరం వస్తే మాత్రం పారాసిటమాల్‌ లాంటివి ప్రతి 6-8 గంటలకు తీసుకోవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని