President Ram Nath Kovind: రాజ్యాంగానికి సమానత్వమే ఆలంబన

సామాజిక అసమానతలను వ్యతిరేకిస్తూ, సమానత్వ భావనను చాటిచెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతించారు. ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు 12వ రోజైన ఆదివారం రాష్ట్రపతి

Updated : 14 Feb 2022 05:14 IST

 రామానుజులే మన నేతలకు ప్రేరణ

సువర్ణమూర్తి ఆవిష్కరణలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ఈనాడు - హైదరాబాద్‌

సామాజిక అసమానతలను వ్యతిరేకిస్తూ, సమానత్వ భావనను చాటిచెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతించారు. ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు 12వ రోజైన ఆదివారం రాష్ట్రపతి తన సతీమణి సవితా, కుమార్తె స్వాతిలతో కలిసి హాజరయ్యారు. 120 కిలోల రామానుజుల బంగారు విగ్రహాన్ని ఆయన మధ్యాహ్నం 3.57 గంటలకు ఆవిష్కరించారు. అనంతరం పుష్పార్చనలో పాల్గొన్నారు. కేంద్రాన్ని సందర్శించాక సభలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘రామానుజులు ప్రవచించిన సమానత్వమనే మౌలిక సూత్రమే మన రాజ్యాంగానికి ఆలంబన. ఆయన బాటలోనే మనం నిర్దేశించుకున్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ సహా ఎందరో నేతలు రామానుజాచార్యుల సమానత్వ భావనతో ప్రేరణ పొందారు. అంబేడ్కర్‌ పుట్టిన గ్రామం, ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సమానత్వాన్ని చాటిచెప్పే పవిత్రక్షేత్రాలు. రామానుజులు బోధించిన విశిష్టాద్వైతం సిద్ధాంతం మాత్రమే కాదు. అది మన నిత్యజీవితానికి ఉపయోగపడే అంశం. ఆయన సువర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషదాయకం. శ్రీరామనగరంలో సమానత్వం విలసిల్లుతోంది’ అని రాష్ట్రపతి అన్నారు. ఆయన పర్యటనలో గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, జీయర్‌ ట్రస్టు ప్రతినిధులు చలిమెడ లక్ష్మీనర్సింహారావు, జీవీ భాస్కరరావు పాల్గొన్నారు.

దాదాపు రెండున్నర గంటలపాటు పర్యటన

రాష్ట్రపతి పర్యటన దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. ఆయన మధ్యాహ్నం దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు చేరుకున్నారు. తొలుత భద్రవేదిలోని మొదటి అంతస్తులో బంగారుమూర్తిని ఆవిష్కరించారు. పూజల అనంతరం నగదు కానుకను సమర్పించారు. విగ్రహం ముందు ఉన్న బంగారు శఠారితో చినజీయర్‌స్వామి రాష్ట్రపతిని, కుటుంబసభ్యులను ఆశీర్వదించారు. తర్వాత వారు మూడో అంతస్తులోని రామానుజుల విరాట్‌ విగ్రహాన్ని, 108 దివ్యదేశాలను సందర్శించారు. కేంద్రం విశేషాలను చినజీయర్‌స్వామి వెంట ఉండి వివరించారు. తర్వాత ప్రవచన మండపంలో సుమారు 22 నిమిషాలసేపు రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించారు. తెలుగు కవి అన్నమాచార్య మొదలుకుని ఉత్తర భారతానికి చెందిన మహనీయులను ప్రస్తావిస్తూ.. వారికి రామానుజులు కలిగించిన ప్రేరణను వివరించారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి, కుటుంబసభ్యులు రాజ్‌భవన్‌కు పయనమయ్యారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.


తెలంగాణలో విశిష్టమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడవచ్చు. గోదావరి ప్రవహిస్తుండడం ద్వారా నా దృష్టిలో ఈ రాష్ట్రం విశేష మహత్యాన్ని కలిగి ఉంది. ఈనాటి కార్యక్రమం ద్వారా దేశంలోని ఆధ్యాత్మిక, సామాజిక పరంపరలోని ఓ ప్రత్యేకమైన అధ్యాయంలో భాగస్వామినయ్యే గొప్ప అవకాశం నాకు లభించింది.

- రాష్ట్రపతి కోవింద్‌


ఇనుమడిస్తున్న దేశ గౌరవం: చినజీయర్‌స్వామి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హయాంలో దేశ గౌరవం ఇనుమడిస్తోందని చినజీయర్‌స్వామి అన్నారు. ‘కశ్మీర్‌ నవ్వుతోంది... కాశీ ఆనందంతో మురిసిపోతోంది.. రామచంద్రస్వామి తన స్థానంలో ప్రతిష్ఠకు సిద్ధమవుతున్నారు’ అని ఆయన చెప్పారు. రామానుజుల స్వర్ణమూర్తి ఆవిష్కరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో చినజీయర్‌స్వామి మాట్లాడారు. ప్రపంచంలోని అందరూ భగవంతుడి బిడ్డలేనని, దళితులు, తాడిత పీడితులంటూ ఉండరని రామానుజులు చాటారన్నారు.

వేయికాళ్ల మండపం కూల్చివేతతో.. భక్తులు ఆవేదన చెందారు

తిరుమల శ్రీవారి సన్నిధిలో వేంకటేశ్వరుని వైభవాన్ని చాటేలా నిర్మించిన వేయికాళ్ల మండపం అజ్ఞానుల బారినపడి రూపం కోల్పోయిందని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మండపం కూల్చివేతపై 20 లక్షల మంది భక్తులు ఆవేదన తెలుపుతూ ‘ఓం నమో వేంకటేశాయ’ నామాన్ని 1100 కోట్ల పర్యాయాలు రాశారని, మండపం అక్కడే తిరిగి రావాలని ప్రార్థించారని ఆయన చెప్పారు. భక్తులు రచించిన పత్రాలను స్తూప రూపంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో జూపల్లి రామేశ్వర్‌రావు స్థలం ఇచ్చారని వివరించారు. ప్రస్తుత ఆశ్రమానికి ఆగ్నేయంగా నిర్మించిన ఆనంద విమానం కింది భాగంలో ఈ పత్రాలను సురక్షితంగా ఉంచామన్నారు.


ఆవిష్కరణ ఫలకంపై కేసీఆర్‌ పేరు

సువర్ణమూర్తి మందిరం వద్ద సంబంధిత శిలాఫలకాన్ని కూడా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరించారు. దీనిపై ఒకవైపు రామ్‌నాథ్‌ కోవింద్‌.. మరోవైపు చినజీయర్‌స్వామి చిత్రాలు చెక్కి ఉన్నాయి. ఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరును చెక్కించారు. రామానుజుల సువర్ణమూర్తికి సోమవారం ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అప్పటి నుంచి నిత్యారాధన, నిత్య నైవేద్యాలు నిర్వహిస్తారు.


రాష్ట్రపతికి గవర్నర్‌, సీఎంల ఘన స్వాగతం

ఈనాడు, హైదరాబాద్‌: ముచ్చింతల్‌లో రామానుజాచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆదివారం ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ఆయన సతీమణి సవితలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఆయనకు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి ఆర్మీ హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయల్దేరి వెళ్లారు.  


నేడు మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌
 ముగియనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం యాగశాలల వద్ద నిర్వహించే మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నారు. అనంతరం 108 దివ్యదేశాల్లో దేవతామూర్తుల కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో ఈ దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠలు ఆదివారంతో పూర్తయ్యాయి. దివ్యదేశాల సందర్శనకు సాధారణ భక్తులను సోమవారం నుంచి అనుమతించనున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని