Indian Railway: రైల్వే రెడ్‌ సిగ్నల్‌!

దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ 66,687 రూట్‌ కిలోమీటర్లు ఉంటే.. అందులో రాష్ట్రంలో ఉన్నది కేవలం 1,737 రూట్‌ కిలోమీటర్లే. అంటే 2.8 శాతం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. బిహార్‌తో పోల్చిచూస్తే ఇక్కడ అందులో సగం కూడా లేవు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా కొత్త రైల్వే లైన్ల మంజూరు, డబ్లింగ్‌లోనూ ప్రాధాన్యం లభించట్లేదు. ఏళ్ల క్రితం మంజూరైన ప్రాజెక్టులకూ దిక్కులేదు. ఉదాహరణకు మంజూరై నాలుగేళ్లు దాటినా యాదాద్రి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. పగిడిపల్లి(బీబీనగర్‌)-నల్లపాడు మధ్య రెండోలైనుకు తుది సర్వే పూర్తయినా నిధులు మంజూరు చేయట్లేదు. సికింద్రాబాద్‌-కాజీపేట మూడో లైను సర్వే పూర్తయినా రైల్వే బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Published : 11 Jan 2022 05:18 IST

రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర జాప్యం

సర్వేలు పూర్తయినా.. బోర్డు వద్దే ప్రతిపాదనలు

రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ 2.8 శాతమే

దేశంలో రాష్ట్రానిది 14వ స్థానం

ఎంపీలు ఒత్తిడి చేస్తేనే బడ్జెట్‌లో మంజూరు

ఈనాడు - హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ 66,687 రూట్‌ కిలోమీటర్లు ఉంటే.. అందులో రాష్ట్రంలో ఉన్నది కేవలం 1,737 రూట్‌ కిలోమీటర్లే. అంటే 2.8 శాతం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. బిహార్‌తో పోల్చిచూస్తే ఇక్కడ అందులో సగం కూడా లేవు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా కొత్త రైల్వే లైన్ల మంజూరు, డబ్లింగ్‌లోనూ ప్రాధాన్యం లభించట్లేదు. ఏళ్ల క్రితం మంజూరైన ప్రాజెక్టులకూ దిక్కులేదు. ఉదాహరణకు మంజూరై నాలుగేళ్లు దాటినా యాదాద్రి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. పగిడిపల్లి(బీబీనగర్‌)-నల్లపాడు మధ్య రెండోలైనుకు తుది సర్వే పూర్తయినా నిధులు మంజూరు చేయట్లేదు. సికింద్రాబాద్‌-కాజీపేట మూడో లైను సర్వే పూర్తయినా రైల్వే బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ప్రాజెక్టుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం, ఒప్పందానికి ముందుకు రాకపోవడం వంటి సమస్యలూ కారణంగా ఉన్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంటారు. ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. చివరి ప్రయత్నంగా రాష్ట్ర ఎంపీలు ఇప్పుడైనా గట్టి ప్రయత్నంచేస్తే కొత్త రైల్వే లైన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించాక రహదారులు బుల్లెట్‌ వేగంతో దూసుకుపోతుండగా..రైల్వే మార్గాల విస్తరణ మాత్రం అంతే నెమ్మదిగా సాగుతోంది. ఏడేళ్లలో అనేక కొత్త జాతీయ రహదారులు వచ్చాయి. ఉన్న వాటిని రెండు, నాలుగు వరసలుగా విస్తరించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయ రహదారుల విస్తరణతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. విజయవాడకు రోడ్డు మార్గంలో నాలుగు గంటల్లో చేరుకునే పరిస్థితి ఉంది. అదే సమయంలో రైల్వే మార్గాలు ఏడేళ్లలో పెరిగింది కేవలం 6.6 శాతమే. దీంతో విజయవాడకు రైలు ప్రయాణం ఆరు గంటలు పడుతోంది. హైదరాబాద్‌ నుంచి మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూరుకు ఇప్పటికీ సింగిల్‌ లైను రైలు మార్గమే ఉంది. ఒకే ట్రాక్‌పై వచ్చేపోయే రైళ్లు ఆగుతూ, సాగుతూ వెళ్లాల్సిన పరిస్థితి. కొత్త లైన్ల మంజూరుతోపాటు సింగిల్‌, డబుల్‌ లైన్లలో రెండో, మూడోలైన్లు విస్తరిస్తేనే రైళ్ల వేగం పెరుగుతుంది. ఆ దిశగా చొరవ కరవైంది.

రాష్ట్ర డిమాండ్లు ఇవీ

కొత్త రైళ్లు, అదనపు మార్గాలపై అనేక డిమాండ్లు ఉన్నాయి. కాజీపేట-హుజూరాబాద్‌-కరీంనగర్‌, ఆర్మూర్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌, పటాన్‌చెరు-సంగారెడ్డి-మెదక్‌, ఘన్‌పూర్‌-సూర్యాపేట వయా పాలకుర్తి తదితర కొత్త లైన్‌ ప్రాజెక్టులలో కొన్నింటి సర్వేలు పూర్తయ్యాయి. అయినా ముందుకు కదలట్లేదు.

* సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు, ముంబయి వరకు లైన్‌ను డబ్లింగ్‌ చేయాలి.
* సికింద్రాబాద్‌-శ్రీశైలం రోడ్‌, మణుగూరు-రామగుండం లైన్ల ప్రతిపాదనలు
* కాజీపేటలో పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ ప్రాజెక్టు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.
* హైదరాబాద్‌-విజయవాడకు జాతీయ రహదారి పక్కనుంచే హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు వస్తే దూరం 50-60 కి.మీ. తగ్గుతుంది. ఘట్‌కేసర్‌-కాజీపేట వరకు మూడో లైను వేస్తే ఏపీ, తమిళనాడు వైపు, ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణం సులభం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని