Railway projects: పట్టాలెక్కని ప్రాజెక్టులు

రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి.

Published : 17 Jun 2024 05:52 IST

ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక, తుది సర్వేలు 
ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే రూ.83,543 కోట్ల కొత్త పనులు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా.. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జులైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.


దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైల్వే నెట్‌వర్క్‌లో చాలా వెనకబడి ఉన్న తెలంగాణను సర్వేల పేరుతో రైల్వే శాఖ ఊరింపులకే పరిమితం చేస్తోంది. ప్రాథమిక సర్వే, తుది సర్వే అంటూ ఇటు దక్షిణ మధ్య రైల్వే, అటు రైల్వే బోర్డు సంవత్సరాలకు సంవత్సరాలు సాగదీస్తున్నాయి. ఫలితంగా ఏటా కేంద్ర బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టుల మంజూరులో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. రాష్ట్రంలో తుది సర్వే మంజూరైన రైల్వే ప్రాజెక్టులు 30 ఉన్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే కొత్తగా రూ.83,543 కోట్ల రైల్వే పనులు మొదలవుతాయి.

రైలు కూత వినని ప్రాంతాలెన్నో..

భద్రాచలం, మేడారం, రామప్ప దేవాలయం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. జిల్లా కేంద్రాలైన వనపర్తి, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌తోపాటు కొడంగల్, పరిగి, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ వంటి వెనకబడిన ప్రాంతాలకు.. నిర్మల్, ఇచ్చోడ వంటి అటవీ ప్రాంతాలకు ఇప్పటివరకు రైల్వే అనుసంధానమే లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలనూ, లక్షపైన జనాభా ఉన్న అన్ని పట్టణాలనూ రైలు మార్గంతో అనుసంధానిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన ప్రణాళిక దశలోనే ఉంది. తెలంగాణ ఆవిర్భవించాక కేంద్రం మంజూరు చేసిన ఫైనల్‌ లొకేషన్‌ సర్వే(ఎఫ్‌ఎల్‌ఎస్‌) ప్రాజెక్టుల సంఖ్య అంతకుముందు పదేళ్లతో పోలిస్తే పెరిగింది. అంతకుముందు పదేళ్లలో రూ.10,912 కోట్ల విలువైన ఐదు ఎఫ్‌ఎల్‌ఎస్‌ ప్రాజెక్టులే మంజూరయ్యాయి. నిధుల కేటాయింపు పెరుగుతున్నా రాష్ట్ర అవసరాలతో పోలిస్తే తక్కువే.

  • వికారాబాద్‌-కృష్ణా వయా కొడంగల్‌ 122 కి.మీ. మేర కొత్త రైలు మార్గం ప్రాజెక్టుకు 2010 జూన్‌లో సర్వే మంజూరైంది. దీని నిర్మాణానికి రూ.787 కోట్లు ఖర్చవుతుందంటూ అంచనా వేశారు. 2012 మార్చిలో రైల్వేబోర్డుకు ఈ మేరకు నివేదిక ఇచ్చారు. 2023 సెప్టెంబరు 8న తుది సర్వే మంజూరైంది. ఈలోగా ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.2,196 కోట్లకు చేరింది. తుది సర్వే మంజూరై 9 నెలలు దాటినా పనులు మొదలవలేదు. గోవా వెళ్లేందుకు ఇది దగ్గరిదారి అవుతుంది.
  • శంషాబాద్‌-విజయవాడ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ సర్వేకు రైల్వేబోర్డు గతేడాది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే గంటకు 220 కి.మీ.గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పెట్‌ (ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌) సర్వే ఏడాదిగా జరుగుతోంది. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్‌-విజయవాడ మధ్య దూరం తగ్గుతుంది. 
  • కరీంనగర్‌-హసన్‌పర్తి 62 కి.మీ. కొత్త రైలు మార్గం సర్వే 2011లో మంజూరైతే రైల్వేబోర్డుకు నివేదిక 2013లో చేరింది. అప్పుడు అంచనా వ్యయం రూ.464 కోట్లు. ఆలస్యంతో రూ.1,116 కోట్లకు చేరింది. 
  • దిల్లీ, విజయవాడ వైపు వెళ్లే రైళ్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్‌-కాజీపేట మార్గంలో ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి. 85.48 కి.మీ. మేర మూడో లైను నిర్మిస్తే రాకపోకలు సులభమై రైళ్ల వేగం పెరుగుతుంది. మూడో లైనుకు 2014లో సర్వే మంజూరైతే 2018లో రైల్వేబోర్డుకు ప్రాథమిక సర్వే నివేదికను సమర్పించారు.

ఎఫ్‌ఎల్‌ఎస్‌ ప్రాజెక్టులు ఇలా..

ఆయా ప్రాజెక్టులకు సంబంధించి తుది సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రైల్వేబోర్డుకు సమర్పించాలి. బోర్డు పచ్చజెండా ఊపితే కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ ఆ ప్రాజెక్టుల్ని చేర్చి నిధులు కేటాయిస్తుంది. రాష్ట్రానికి సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వేల్లో- కొత్త లైన్లతోపాటు అదనపు లైన్ల మార్గాలూ ఉన్నాయి.


మొదలవ్వని రీజనల్‌ రింగ్‌ రైల్‌ సర్వే!

రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అనుబంధంగా ‘రీజనల్‌ రింగ్‌ రైల్‌ లైన్‌’ను నిర్మించనున్నట్లు కేంద్రం గతేడాది ప్రకటించింది. తుది సర్వే మంజూరు చేసి రూ.14 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సర్వే మొదలేకాలేదు. పైసా ఖర్చు చేయలేదు. 564 కి.మీ. ప్రతిపాదిత రైలు మార్గం ప్రాథమిక అంచనా వ్యయం రూ.12,408 కోట్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని