Rain Alert: నేడు 16 జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో బుధవారం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అప్రమత్తం చేసింది.

Updated : 12 Jun 2024 06:44 IST

మంగళవారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో చార్మినార్‌ వద్ద పర్యాటకుల అవస్థలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా.. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

బొమ్మలరామారంలో 6.9 సెం.మీ. 

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 6, తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెం.మీ. కురిసింది.


పిడుగుపాటుకు ఇద్దరి మృతి

తొగుట, చిలప్‌చెడ్, న్యూస్‌టుడే: పిడుగుపాటుకు సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్‌ జిల్లాలో ఓ మహిళ మృతిచెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన రైతు కడారి శ్రీశైలం(45) మంగళవారం సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడడంతో అపస్మారక స్థితికి చేరారు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం సోమక్కపేట గంగిరెద్దులగూడకు చెందిన ఎల్లమ్మ(45) గ్రామ శివారులో నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని