Ramesh Karthik Nayak: రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ను వరించిన ‘యువ పురస్కార్‌’

ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్‌ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది.

Published : 16 Jun 2024 06:11 IST

దేశవ్యాప్తంగా 23 మంది ఎంపిక
మరో 24 మందికి బాల సాహిత్య పురస్కారాలు
ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ

దిల్లీ; ఈనాడు, నిజామాబాద్, హైదరాబాద్‌: ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్‌ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 మంది బాల సాహిత్య పురస్కార్‌ విజేతల పేర్లనూ వెల్లడించింది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన 26 ఏళ్ల రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ‘ఢావ్లో’ (విషాద గీతం) రచనకు యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో పిన్నవయస్కుడు, గిరిజన తెగకు చెందిన రచయిత కూడా ఈయనే కావటం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ చేసిన రమేశ్‌.. ప్రస్తుతం ఎంఏ తెలుగు చదువుతున్నారు. రమేశ్‌ రాసిన వచన కవితా సంపుటి.. ‘బల్దేర్‌ బండి’ పుస్తకాన్ని 2019లో తెలంగాణ భాషా, సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సంపుటిలోని ‘జారేర్‌ బాటి’ (జొన్నరొట్టెలు) కవితను కాకతీయ విశ్వవిద్యాలయం పరిధి డిగ్రీ తెలుగు పాఠ్యపుస్తకంలో పొందుపర్చారు. ‘బల్దేర్‌ బండి’ వచన సంపుటిలోని కవితలను ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీ తెలుగు పాఠ్యాంశంలో చేర్చారు. ఢావ్లో సంపుటిలోని పురుడు కథ అంతర్జాతీయ సాహిత్య అనువాద జర్నల్‌లో ప్రచురితమైంది. తమిళంలో లోకేశ్‌ రఘురామ్, కన్నడలో బి.ఆర్‌.శ్రుతి యువ పురస్కారాలకు ఎంపికయ్యారు.

కేటీఆర్‌ అభినందనలు

కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన రమేశ్‌కార్తీక్‌ నాయక్‌కు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం అభినందించారు.   


చంద్రశేఖర్‌ ఆజాద్‌కు కేంద్ర బాలసాహిత్య పురస్కారం

ప్రముఖ రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్‌ ఆజాద్‌ రచించిన మాయాలోకం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం వరించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో సాగింది. తెలుగులోని వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే ధారావాహికలకు ఆయన రచనా సహకారం అందించారు. వీటిల్లో రాధామధు, అడవిపూలు ధారావాహికలకు ఉత్తమ స్క్రీన్‌ప్లే, సంభాషణల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 85 నవలలు, 900 కథలు రాశారు. 30 నవలలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల బహుమతులు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మొత్తం 24 మంది బాల సాహిత్య పురస్కార్‌ విజేతల పేర్లను కేంద్ర సాహిత్య అకాడమీ శనివారం ప్రకటించింది. కన్నడలో కృష్ణమూర్తి బిలిగెరె, తమిళంలో యువ వాసుకి బాలల సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. యువ పురస్కార్, బాల సాహిత్య పురస్కార్‌ విజేతలు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కు, జ్ఞాపిక ప్రదానం చేయనున్నారు.

మాయాలోకం నవల ముఖచిత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని