TG News: పాఠశాలల హేతుబద్ధీకరణ మేలు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరించాల్సిన అవసరముందని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Published : 09 Jul 2024 04:38 IST

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ సలహా
13,364 ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువే
5,821..  ఏకోపాధ్యాయ పాఠశాలలేనని వెల్లడి  

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరించాల్సిన అవసరముందని కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 30,023 పాఠశాలలు నడుస్తుండగా... వాటిలో 45.18% చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉన్నట్లు తెలిపింది. ఏకంగా 13,364 పాఠశాలల్లో పిల్లలు 50 మందిలోపే ఉన్నారంది. సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) సమావేశం కోసం తెలంగాణ నుంచి అందిన వివరాలను విశ్లేషించిన కేంద్ర విద్యాశాఖ... వివిధ అంశాలపై రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. పీఏబీ తీర్మానాలనూ తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలోని 1,213 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడని, 5,821 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలను హేతుబద్ధీకరించాలని... ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలంది. అంటే పిల్లలు లేని పాఠశాలలను సమీపంలోని బడిలో విలీనం చేస్తే అప్పుడు అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం తాజా బదిలీలు, పదోన్నతులతో చాలావరకు పరిస్థితిలో మార్పు వచ్చిందని చెబుతున్నాయి. 

డైట్లలో 68% అధ్యాపకుల ఖాళీలు 

రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి పలు అంశాలను విశ్లేషించిన కేంద్రం... డైట్లను విశిష్ఠ ప్రతిభా కేంద్రాలుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 

  • తెలంగాణలో 10 ప్రభుత్వ డైట్లు (డీఈడీ కోర్సులందించే) ఉండగా... వాటిల్లో 67.83% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన ఎస్‌సీఈఆర్‌టీలోనూ 46.15% ఖాళీలే. ఈ సంస్థలకున్న ప్రాధాన్యం దృష్ట్యా యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలి. 
  • 9.44% బడుల్లో బాలురకు, 5.86% పాఠశాలల్లో బాలికలకు, 15.45% బడుల్లో దివ్యాంగులకు మూత్రశాలలు లేవు.  
  • మేం మంజూరు చేసినా ఇప్పటికీ 18.13% సైన్స్‌ ల్యాబ్‌లు, 11.70% కంప్యూటర్‌ ల్యాబ్‌లు, 71% నైపుణ్య విద్య ల్యాబ్‌లు పూర్తి చేయలేదు. ్య రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ బడుల్లో 76% చోట్ల ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించారు. మిగిలిన 24% చోట్ల పూర్తి చేయాలి.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని