RGUKT Basar: ఆర్జీయూకేటీలో ఇష్టారాజ్యం.. నిబంధనలు పాటించని రెగ్యులర్ అధ్యాపకులు

బాసర ఆర్జీయూకేటీ... ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాలయంలో నిబంధనల అతిక్రమణ యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలను తోసిరాజని కొందరు అధ్యాపకులు పీహెచ్‌డీలు చేసుకుంటూ ఇక్కడ వేతనం తీసుకుంటున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Updated : 08 Oct 2022 09:50 IST

వేతనం తీసుకుంటూ పీహెచ్‌డీలు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీ... ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాలయంలో నిబంధనల అతిక్రమణ యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలను తోసిరాజని కొందరు అధ్యాపకులు పీహెచ్‌డీలు చేసుకుంటూ ఇక్కడ వేతనం తీసుకుంటున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకులు మొత్తం 19 మంది. వారందరూ విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సి ఉండగా తొమ్మిది మంది నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు సమాచారం. 2018లో బయటకు వెళ్లిన వీరు పీహెచ్‌డీలు చేస్తూ... వేతనం మాత్రం ఆర్జీయూకేటీ నుంచి తీసుకుంటున్నారు. నిజానికి వారికి పీహెచ్‌డీ చేయడానికి మూడేళ్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. దీనిపై కొద్ది రోజుల క్రితం కొందరు అధ్యాపకులు ఫిర్యాదు చేసినా రాజకీయ అండతో అవేమీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా అధ్యాపకులున్నారు. ఇందులో ఒక మహిళా అధ్యాపకురాలు పీహెచ్‌డీ చేస్తానని చెప్పి ఇతర దేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలపాలవుతోంది. నిబంధనల ప్రకారం అంతమందికి పీహెచ్‌డీకి అనుమతి, వేతనం ఇవ్వకూడదు. వారి స్థానంలో తాత్కాలిక అధ్యాపకులను సైతం నియమించారు. వీరికీ ఆర్జీయూకేటీ నుంచే వేతనం చెల్లిస్తున్నారు. మరోవైపు బాసర ఆర్జీయూకేటీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్న వారిని ఇంతవరకు రెగ్యులర్‌ చేయలేదు. కానీ రెగ్యులర్‌ అధ్యాపకులకు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వెంటనే వెనక్కి రప్పించి విద్యార్థులకు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
- వెంకటరమణ, ఆర్జీయూకేటీ ఉపకులపతి

ఆర్జీయూకేటీలో 19 మంది రెగ్యులర్‌ అధ్యాపకులున్నారు. ప్రస్తుతం 10 మందే బోధిస్తున్నారు. మిగిలిన 9 మంది పీహెచ్‌డీల కోసం బయటకు వెళ్లారు. వారిపై ఫిర్యాదులున్నాయి. దానిపై విచారణ చేపట్టి ఎవరు అనుమతి తీసుకున్నారు, ఎంత మంది తీసుకున్నారన్నది విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని