Schools Reopen: పూలు చల్లి.. హారతులిచ్చి..

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలల పునఃప్రారంభం పండగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.

Published : 13 Jun 2024 05:19 IST

పండగలా బడుల పునఃప్రారంభం

ఆదిలాబాద్‌ జిల్లా కప్పర్లలో ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు

ఈనాడు-హైదరాబాద్, ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్, ఖమ్మం కమాన్‌బజార్‌-న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలల పునఃప్రారంభం పండగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులకు బొట్టు పెట్టి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. హారతిపట్టి, పూలు చల్లుతూ విద్యార్థులకు సాదర స్వాగతం పలికారు. పునఃప్రారంభం సందర్భంగా వివిధ జిల్లాల్లో ప్రభుత్వ బడులను మామిడి తోరణాలు, అరటి ఆకులతో ముస్తాబు చేశారు. ముంగిళ్లను ముగ్గులతో అలంకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలకు హాజరై విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ఉన్నత పాఠశాలను విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు పి.రాజీవ్‌ సందర్శించి పిల్లలతో మాట్లాడారు.

పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని సత్కరిస్తున్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాజాసింగ్‌

సర్కారు బడులపై పదేళ్లపాటు నిర్లక్ష్యం: మంత్రి పొన్నం

గత ప్రభుత్వం పదేళ్లపాటు రాష్ట్రంలోని సర్కారు బడులు, విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం చూపిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఆలియా మోడల్‌ హైస్కూల్‌లో నిర్వహించిన ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరిట రూ.1100 కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులను కల్పిస్తోందని వివరించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలను ఆలియా మోడల్‌ హైస్కూల్‌లా తీర్చిదిద్దాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మంత్రిని కోరారు. గత విద్యాసంవత్సరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు.


విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం: భట్టి విక్రమార్క

విద్యార్థినికి దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల 

విద్యారంగానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్నెస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి  ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం విద్యకు ప్రాధాన్యమిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా 10 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని