Komati Reddy: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారికి నిధులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందికి గురయ్యాయని.. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిధులు మంజూరు చేయించానని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.

Published : 24 Jun 2024 05:15 IST

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాలలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల ప్రారంభం

ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. చిత్రంలో శాసనమండలి ఛైర్మన్‌
గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అయిలయ్య, వీరేశం తదితరులు 

చిట్యాల, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు ఇబ్బందికి గురయ్యాయని.. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిధులు మంజూరు చేయించానని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అధికారికంగా గుర్తించిన 17 బ్లాక్‌ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం రూ.325 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఒక ఫ్లైఓవర్, 13 అండర్‌పాస్‌లు, 10 సర్వీస్‌ రోడ్లు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాలలో ఆదివారం ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేయనున్నానని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండతోపాటు తన సొంత నియోజకవర్గం నకిరేకల్‌కు కూడా అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో మిగిలిన పనులను రూ.400 కోట్లతో పూర్తి చేయించి.. మూడు నెలల్లో 62 వేల ఎకరాలకు నీరందించనున్నట్లు వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ, ఇతర ప్రాజెక్టులకు సీఎం రూ.2,200 కోట్లు మంజూరు చేశారన్నారు. చిట్యాల పీహెచ్‌సీని దాతల సహకారంతో 50 పడకల ఆసుపత్రిగా మార్చనున్నామని చెప్పారు. కేతేపల్లి టోల్‌గేట్‌ వద్ద ప్రవాస భారతీయుల సహకారంతో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేయనున్నామన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తన జీవితం ప్రజలకే అంకితమని, వారికోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. ఇందిరమ్మ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌డ్డి, నకిరేకల్, ఆలేరు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, చిట్యాల మున్సిపల్‌ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు