TG News: ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.19 వేల కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో 19 ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.19,287 కోట్ల నిధులు కేటాయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది.

Updated : 09 Jul 2024 03:30 IST

6.83 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం
నీటిపారుదల శాఖ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో 19 ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.19,287 కోట్ల నిధులు కేటాయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. బడ్జెట్‌ కేటాయింపులపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రెండు రోజులుగా వరుస సమీక్షలు నిర్వహించారు. సోమవారం ఈఎన్సీలు, సీఈలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. మరోవైపు, మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జలసౌధలో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి తదితరులతో కలిసి ఆ జిల్లా ప్రాజెక్టులపై ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. 

కొత్త ఆయకట్టు పెంచడమే లక్ష్యం..

తక్కువ ఖర్చుతో తుది దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా కొత్త ఆయకట్టును సాధ్యమైనంత వరకు పెంచేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 19 ప్రాజెక్టుల కింద ఈ ఏడాది కొత్తగా 6.83 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఆయకట్టు లక్ష్యాన్ని పెంచనుంది. వార్షిక బడ్జెట్‌లో పెండింగ్‌ బిల్లుల కింద రూ.9,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. మహాత్మా గాంధీ కల్వకుర్తి, దేవాదుల ఎత్తిపోతల, శ్రీరాంసాగర్‌ రెండో దశ కింద ఇప్పటికే స్థిరీకరణలో ఉన్న ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు కొత్త ఆయకట్టును తేల్చాలని నిర్ణయించారు. సీతారామ, నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాల కింద కొత్త ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇతర ప్రాజెక్టుల కింద తుది దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టుతో పాటు కొంతమేరకు కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని