Rythu Bandhu: సాగు చేయకున్నా రూ.25,672 కోట్ల సాయం

రైతుబంధు పథకంలో భాగంగా... పంటలు సాగవని భూములకు, రైతులు కాని వారికి భారీగా పెట్టుబడి సాయం అందిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.

Published : 10 Jul 2024 03:21 IST

రైతుబంధు కింద గత ఆరేళ్లలో అందజేత
మంత్రివర్గ ఉపసంఘానికి వ్యవసాయ శాఖ నివేదిక
అనర్హులను మినహాయిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదా

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకంలో భాగంగా... పంటలు సాగవని భూములకు, రైతులు కాని వారికి భారీగా పెట్టుబడి సాయం అందిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా స్థిరాస్తి వెంచర్లు, గుట్టలు, బంజరు భూములు, రోడ్లున్న భూముల యజమానులు లాభం పొందారని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 12 విడతల్లో రైతుబంధు కింద రూ.80,453 కోట్లు విడుదలవగా అందులో రూ.25,672 కోట్లు సాగులో లేని భూములకు అందినట్లు వివరించింది. ఈ మేరకు అనర్హులను ఏరివేస్తే ప్రభుత్వానికి నిధులు ఆదా అవుతాయని సూచించింది. రాష్ట్రంలో రైతుబంధు స్థానంలో రైతు భరోసాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పథకం విధివిధానాల రూపకల్పనకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కూడిన ఉపసంఘం ఏర్పాటు చేసింది. 

చిన్న, సన్నకారు రైతులే అధికం 

ఇటీవల మొదటి సమావేశం నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం... రైతుబంధు అమలైన తీరుపై సమగ్ర వివరాలను ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. దాంతో వ్యవసాయ శాఖ తన నివేదికను మంగళవారం సమర్పించింది. సాగు చేయకున్నా... రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిసి 2018-19 నుంచి ఆరేళ్లపాటు రైతుబంధు కింద అందిన సాయం వివరాలను అందులో పేర్కొంది. వ్యవసాయం ఏమాత్రం లేకున్నా వారికి సైతం సాయం అందించినట్లు వాటిలో వివరించింది. రాష్ట్రంలో మొత్తం 157.43 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 74.58 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వీరిలో 90% మంది సన్న, చిన్నకారు రైతులే. పథకంలో భాగంగా.. 2018-19లో 50 లక్షల మందికి, 2019-20లో 52 లక్షల మందికి, 2020-21లో 59 లక్షల మందికి, 2021-22లో 63 లక్షల మందికి, 2022-23లో 65 లక్షల మందికి, 2023-24లో 69 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు తెలిపింది. 

ఇలా చేస్తే రూ.వేల కోట్ల మిగులు 

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులు 152.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయశాఖ వివరించింది. రైతు భరోసా కింద... ఐదెకరాల్లోపు వారికి మాత్రమే సాయమందిస్తే ప్రభుత్వానికి రూ.3,824.2 కోట్ల మేరకు, పదెకరాలలోపు వారికిస్తే రూ.1,385 కోట్లు ఆదా అవుతాయని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రస్తుత విధానంలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేయడానికి యేటా రూ.2,260 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనంగా భారం పడుతుందని తేల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని